రెండేళ్ల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధ పడినట్లు నటి సుష్మితా సేన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందికర పరిస్థితుల గురించి వివరించింది. 

'నిర్భాక్' అనే బెంగాలీ సినిమాలో నటించిన తరువాత అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు పరీక్షించి తనకు ఆడ్రినల్ గ్రంథుల పనితీరు ఆగిపోయిందని, బ్రతికినంత కాలం హైడ్రోకోర్టిసోన్ అనే స్టెరాయిడ్ తీసుకోవాలని సూచించినట్లు చెప్పింది. ఎనిమిది గంటలకొకసారి స్టెరాయిడ్ తీసుకోకపోతే చనిపోతానని చెప్పినట్లు ఆమె తెలిపారు. అయితే ఆ స్టెరాయిడ్ కారణంగా బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం వంటివి జరిగేవట.

తను సాధారణ మహిళ అయితే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదని, కానీ మాజీ విశ్వసుందరి కావడంతో.. తన ఆకారం చూసి ఏదో అయిపోయిందని అందరూ అనుకుంటారని బయటకి రాలేకపోయినట్లు తెలిపారు. ఎలాగైనా కోలుకోవాలని.. ట్రీట్మెంట్ కోసం జర్మనీ, లండన్ వెళ్లి, ఆరోగ్యం కోసం ఏరియల్ సిల్క్ అనే యోగ సాధనాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు.

వైద్యులు అవి చేయొద్దని చెప్పినా ఆమె వినలేదట. 2016 చివర్లో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో హాస్పిటల్ లో చేసినట్లు, కొన్ని చికిత్సల అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు చెప్పింది. ఆ తరువాత డాక్టర్ ఫోన్ చేసి ఇక స్టెరాయిడ్స్ వాడడం ఆపేయమని తన శరీరంలో ఆడ్రినల్ గ్రంథుల పనితీరు మెరుగుపడిందని చెప్పారని.. ఆ సమయంలో తను ఎంతో ఆనందపడినట్లు వివరించింది. సాధారణంగా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కోలుకోవడం చాలా కష్టమని, కానీ తాను కోలుకున్నానని చెప్పింది.