సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు అనేక మలుపులతో సాగుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టు అనేక సంచలన విషయాలు, కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్య అనే ఆరోపణలు వస్తున్నాయి. లేదు లేదు సుశాంత్‌ ఆత్మహత్యే చేసుకున్నాడని ఆయన వంటమనిషి చెప్పాడు. తాజాగా మరో పని మనిషి మరో కొత్త విషయాన్ని వెల్లడించాడు. 

సుశాంత్‌ ఇంట్లో పనిచేసిన నీరజ్‌ సింగ్‌ అనే వ్యక్తి సుశాంత్‌ గురించి సంచలన విషయాలను తెలిపాడు. తాజాగా ముంబయి పోలీసుల విచారణలో భాగంగా సుశాంత్‌ గంజాయి  తీసుకునేవాడని నీరజ్‌ సింగ్‌ వెల్లడించినట్టు జాతీయ మీడియా రాసుకొచ్చింది. సుశాంత్‌ తరచూ గంజాయితో నింపిన సిగరెట్లని తాగేవాడని వెల్లడించినట్టు మీడియా ప్రసారం చేస్తుంది. 

ఇందులో నీరజ్‌ చెబుతూ, సుశాంత్‌ సర్‌ తన ఇంట్లో వారానికి రెండుసార్లు పార్టీ చేసుకునేవాడు. మద్యం, గంజాయితో నిండిన సిగరెట్లని వాడేవారని తెలిపారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు తాను ఆయనకు గంజాయితో కూడిన సిగరెట్ పెట్టెలను ఇచ్చానని వెల్లడించాడు. ఆయన చనిపోయిన తర్వాత చూస్తే ఖాళీ పెట్టేలు కనిపించాయని చెప్పాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కోణంలోనూ విచారణ చేపట్టాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

మరోవైపు ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగి మనీ లాండరింగ్‌ కేసులో విచారణ చేపడుతున్నారు. అనేక కీలక విషయాలను రాబట్టారని సమాచారం.