బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నుంచి ఆయన సన్నిహితులు, బంధువులు కోలుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు షాక్‌లో ఉన్న వారు ఇప్పుడిప్పుడే తేరుకొని తమ స్పందనను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. తాజాగా సుశాంత్ చిన్ననాటి స్నేహితుడు, సందీప్‌ సింగ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పదించాడు. సుశాంత్‌తో కలిసి తాను దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సందీప్‌, సుశాంత్‌తో తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

`ఈ రోజు నేను నీ ఇంట్లోకి వచ్చే సరికి నీ కౌగిలింత లేదు, ఆ సందడి లేదు, ఆ నవ్వులు లేవు. పదేళ్ల అనుబంధంలో ఒక్క మాట కూడా చెప్పుకుండా నన్ను షాక్‌లో వదిలేసి వెళ్లిపోయావ్‌. నాకు మాటలు కూడా రావటం లేదు. నీతో గడిపిన క్షణాలు సరదాలు అన్ని ఇక జీవితాంతం నన్ను వెంటాడుతుంటాయి. నా దర్శకత్వంలో తొలి సినిమా చేస్తానని నాకు మాట ఇచ్చావు. మనిద్దరం బీహారీలం.. మనం ఇండస్ట్రీని ఏళుదాం అని చెప్పావ్‌. కానీ అన్ని మాటలు తప్పావ్‌. నువ్వు మోసం చేశావ్‌. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్‌` అంటూ బావోద్వేగం స్పందించాడు సందీప్‌.

బాలీవుడ్‌ లో హీరోగా సత్తా చాటుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌.. అర్ధాంతరంగా తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ముంబై బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకొని సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్న ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. సుశాంత్ మృతితో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇండస్ట్రీలో నెపోటిజంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.