తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో ఎంత ఫాలోయింగ్ వుందో తెలిసిందే. గజినీ, సింగం లాంటి బ్లాక్ బస్టర్స్ తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు సూర్య. సూర్య నటించిన తాజా చిత్రం గ్యాంగ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలతోపాటు పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు సూర్య.

 

‘గ్యాంగ్’ సినిమా చేస్తున్నప్పుడు తనకు పాత రోజులు గుర్తొచ్చాయని తమిళ స్టార్ హీరో సూర్య చెప్పారు. ‘చదువు అయిపోయింది.. తరవాత ఏ ఉద్యోగం చేయాలి?’ అని ఆలోచించిన రోజులు గుర్తొచ్చాయన్నారు. తన తొలి జీతం 726 రూపాయలని, నా మూలాలను నేను ఎప్పుడూ మరిచిపోలేదని తెలిపారు.

 

సూర్య, కీర్తీ సురేష్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘తానా సేంద కూట్టమ్‌’. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై వంశీ, ప్రమోద్‌ తెలుగులో ‘గ్యాంగ్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘గ్యాంగ్’ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సూర్య.. ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత, సినిమా విషయాలను విలేకరులతో పంచుకున్నారు. ఈ సినిమాను ఒప్పుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు విఘ్నేష్ అని చెప్పారు. తన కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో ఇలాంటి పాత్రలు చేశానన్నారు. గ్యాంగ్ లో తన డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి పాత్ర వరకు అన్నీ కొత్తగా ఉంటాయని తెలిపారు. ఇది బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26’కి రీమేక్ అయినప్పటికీ.. దీనికి భావోద్వేగాలు, కొన్ని పాత్రలు జోడించి తనదైన శైలిలో మార్చారన్నారు. రెండు, మూడు సీక్వెన్స్‌లు ఒకేలా ఉండొచ్చని, చాలా వరకు మార్పులు చేశారన్నారు. అనిరుద్ మంచి సంగీతం అందిచాడని చెప్పారు.
 

‘తెలుగులో తొలిసారి నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. చాలా ఎంజాయ్ చేశాను. నేను చదువుకున్న తమిళ లిటరేచర్‌లో ‘సుందర తెలుంగు’ అన్నారు. ఇండియాలో మధురమైన భాష తెలుగు అని అర్థం. తమిళ డబ్బింగ్‌కు ఎనిమిది రోజులు తీసుకుంటే.. తెలుగు డబ్బింగ్‌ కేవలం ఆరు రోజుల్లో పూర్తి చేసేశాను. ఈ విషయంతో శశాంక్‌ వెన్నెలకంటికి నా కృతజ్ఞతలు’ అని సూర్య వెల్లడించారు. ప్రయోగాలు చేయడం ఎప్పుడూ ఆపనని, అయితే కొత్త కాన్సెప్టులు రావడానికి సమయం పడుతుందని అన్నారు. అలాంటి స్క్రిప్టులు అంత సులువుగా రావన్నారు. ఏదైనా ప్రయోగాత్మక చిత్రం చేసిన తరవాత.. వెంటనే మంచి కమర్షియల్‌ సినిమా చేయడం కరెక్టని సూర్య అభిప్రాయపడ్డారు.

 

‘నేను, కార్తి కలిసి సినిమా చేద్దామనుకున్నాం. కానీ కుదర్లేదు. నేనో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ ఎందుకో అదీ కుదరడంలేదు. త్వరలో ఇది నెరవేరుతుందని అనుకుంటున్నాను’ అని సూర్య తెలిపారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్‌తో ఒక సినిమా మొదలుపెట్టానని.. సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ తనకు జంటగా నటిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత కేవీ ఆనంద్‌తో ఒక సినిమా చేయాలన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదన్నారు. ‘మనల్ని మార్చగలిగేది చదువు అని నా నమ్మకం. అందుకే ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించాను. దీని ద్వారా 2000 మందిని విద్యావంతుల్ని చేస్తున్నాను’ అని సూర్య చెప్పారు.