పవర్ స్టార్ పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి(పిఎస్.పికె25) సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆ సమయానికి ఎనౌన్స్ చేయటంతో.. ఆ సమయానికి రిలీజ్ చేయాలనుకున్న సినిమాలన్నీ ఇప్పుడు వాయిదా వేస్తున్నారు. కానీ తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం తన సినిమాను పవన్‌ సినిమాకు పోటీగా రంగంలోకి దింపుతున్నాడు.

సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించే చాలా సినిమాలు తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంటాయి. ప్రస్తుతం సూర్య.. విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో 'తానా సెర్న్ధ కూట్టం' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ముందుగా డిసెంబర్ నెలలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు జనవరికి వాయిదా వేశారు.

 

వచ్చే ఏడాది జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ జంటగా కనిపించనుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను విడుదల చేస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలుస్తుందో లేదో చూడాలి.