2020 సంవత్సరానికి గాను 68వ జాతీయఅవార్డ్స్ ప్రకటించడం జరిగింది. 13 రాష్ట్రాలకు చెందిన అనేక భాషలకు చెందిన ఫీచర్డ్, నాన్ ఫీచర్డ్ కేటగిరిలో చిత్రాలు పోటీపడ్డాయి. నెలరోజుల పాటు చిత్రాలను చూసిన జ్యూరీ సభ్యులు నేడు వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలను ప్రకటించారు. సూర్య నటించిన సురారైపోట్రు ఐదు అవార్డ్స్ తో దూసుకుపోయింది.
జాతీయ అవార్డ్స్(National Awards) వేదికపై తమిళ చిత్రం సూరరై పోట్రు(Soorarai Pottru) వీరవిహారం చేసింది. ఊహించిన విధంగానే అనేక అవార్డ్స్ కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో సూరారై పోట్రు ఐదు జాతీయ అవార్డ్స్ దక్కించుకుంది. ఉత్తమ నటుడి(Best Actor)గా సూర్య తన మొదటి జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ గోపినాధ్ జీవితం ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరక్కించారు. ఎయిర్ వేస్ స్థాపించి సామాన్యుడికి కూడా విమాన టికెట్ ధర అందుబాటులోకి తేవాలనే కలలు కనే ఓ యువకుడి ప్రయాణమే సూరారై పోట్రు.
ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ చిత్రం, స్క్రీన్ ప్లే, ఉత్తమ సంగీతం(బీజీఎమ్) విభాగాల్లో సూరారై పోట్రు జాతీయ అవార్డ్స్ గెలుపొందింది. ఉత్తమ నటుడిగా సూర్య(Suriya), ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి, మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్, స్క్రీన్ ప్లే రైటర్ గా సుధా కొంగర, షాలిని ఉషా నాయర్, ఉత్తమ చిత్రం విభాగంలో సుధా కొంగర అవార్డులు గెలుపొందారు. జాతీయ వేదికపై తమ చిత్రానికి దక్కిన గౌరవానికి చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సూర్యకు అభినందనలు వెల్లువెత్తున్నాయి.
ఉత్తమ నటుడు అవార్డు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సూర్యతో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ కి జాతీయ అవార్డు దక్కింది. హిస్టారికల్ మూవీ తన్హాజి లో నటనకు గాను జ్యూరీ సభ్యులు ఆయనకు అవార్డు ప్రకటించారు.కాగా తెలుగు నుండి ఫీచర్చ్ విభాగంలో కలర్ ఫోటో అవార్డు దక్కించుకుంది. అలాగే అల వైకుంఠపురంలో చిత్రంలోని సాంగ్స్ కి గాను థమన్ జాతీయ అవార్డు గెలుపొందారు.
