స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా విశేషమైన అభిమానులు ఉన్నారు. మాస్ చిత్రాలతో మెప్పిస్తూనే ప్రయోగాత్మక చిత్రాలలో రాణించడం సూర్య ప్రత్యేకత. గజినీ లాంటి చిత్రంలో అద్భుతమైన నటనతో మెప్పించినా..సింగం సిరీస్ తో సూపర్ కాప్ గా అదరగొట్టినా అది సూర్యకే చెల్లింది. 

ప్రస్తుతం సూర్య బందోబస్త్ అనే చిత్రంలో కెవి ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సెప్టెంబర్ 20న విడుదల కాబోయే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సూర్య తదుపతి చిత్రం కోసం క్రేజీ డైరెక్టర్స్ అంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాస్ చిత్రాల దర్శకుడు శివ సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 

సూర్య, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో కాఖా కాఖా, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. సూర్యతో మరో సినిమా ఉంటుందని గత ఏడాదే గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన వర్క్ ప్రారంభమైంది. 

2.0, ప్రస్తుతం సూర్యతో కాప్పాన్ లాంటి చిత్రాలని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఏఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన చర్చల్లో గౌతమ్ మీనన్ కు నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.