బ్లాక్‌ బస్టర్‌ కాంబో మరోసారి రిపీట్‌ కాబోతుంది. సూర్య, సుధాకొంగర కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. సుధా కొంగర, సూర్య నెక్ట్స్ మూవీ గా వీరిద్దరి కాంబో తెరకెక్కబోతుంది. 

సూర్య వరుస విజయాల మీదున్నాడు. ఆయనకు `ఆకాశమే నీ హద్దురా`, `జై భీమ్‌` చిత్రాలు బంపర్‌ హిట్‌ని అందించాయి. ఆ రెండింటిని మించి గెస్ట్ గా చేసిన `విక్రమ్‌` సూర్య రేంజ్‌ని మార్చేసింది. ఇక వరుస పరాజయాల మీదున్న సూర్యని `ఆకాశమే నీ హద్దురా` సినిమా ఊపిరిపోసింది. సూర్యలోని కసిని బయటకు తీసింది. ఏకంగా జాతీయ అవార్డు దక్కించుకునేలా చేసింది. దీనికి కారకులు దర్శకురాలు సుధా కొంగర. 2020లో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా సంచలన విజయం సాధించింది. 

ఈ బ్లాక్‌ బస్టర్‌ కాంబో మరోసారి రిపీట్‌ కాబోతుంది. సూర్య, సుధాకొంగర కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. సుధా కొంగర, సూర్య నెక్ట్స్ మూవీ గా వీరిద్దరి కాంబో తెరకెక్కబోతుంది. జులైలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. దీనికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందించనున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదుగా,ఈ కాంబో పక్కా అంటోంది తమిళ మీడియా. అంతేకాదు ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించబోతున్నారట. వీరి కాంబోలో వచ్చిన `ఆకాశమే నీ హద్దురా` ఒక మాస్టర్‌ పీస్‌లా నిలిచింది. ఇప్పుడు మరో మాస్టర్‌ పీస్‌ కోసం రెడీ అవుతున్నారు. 

ఇక సూర్య ప్రస్తుతం భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా `కంగువా`లో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. అనంతరం సుధాకొంగర సినిమా తెరకెక్కబోతుందట. దీంతోపాటు సూర్య `వాడి వాసల్‌` అనే సినిమా చేయనున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు తెలుగు దర్శకుడు చందూ మొండేటితోనూ ఓ భారీ సినిమా చేయబోతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 

సూర్యకి అంతకు ముందు `ఎస్‌3` తర్వాత హిట్లు లేవు. అదే ఆయనకు చివరి విజయం. ఆ తర్వాత వచ్చిన `తానా సెంద్రా కూటమ్‌` (గ్యాంగ్‌) సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత `ఎన్జీకే`, `కప్పాన్‌` ఇలా వరుసగా మూడు పరాజయాలు చవిచూశారు. ఈ క్రమంలో `సూరారై పోట్రు`(ఆకాశమే నీ హద్దురా) చిత్రంలో నటించారు. ఇది అతి తక్కువ ధరకి, సామాన్యుడికి విమాన ప్రయాణం చేయాలని తపించి ఆ కలని నిజం చేసిన డెక్కన్‌ ఎయిర్‌లైన్‌ ఫౌండర్‌ జీ ఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందింది. కరోనా నేపథ్యంలో ఈసినిమా ఓటీటీలో విడుదలైంది. మొదట మామూలు టాక్‌ తెచ్చుకున్నా, ఆ తర్వాత పుంజుకుంది. ఓటీటీలో అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది.