క్రేజీ హీరో తలా అజిత్ నటించిన పింక్ రీమేక్ 'నెర్కొండ పార్వయి' చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. అక్కడ పింక్ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. దీనితో ఈ చిత్ర రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. 

శ్రీదేవి కుటుంబానికి, అజిత్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో బోనికపూర్ పింక్ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేశారు. నెర్కొండ పార్వయి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రం అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది.  

ఇప్పటికే అజిత్ అభిమానులు సంబరాలు ప్రారంభమయ్యాయి. అజిత్ అభిమానులే కాదు, సెలెబ్రిటీలు సైతం ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు. సెలెబ్రిటీ జంట స్టార్ హీరో సూర్య, జ్యోతిక 'నెర్కొండ పార్వయి' చిత్ర తొలి షోని వీక్షించారు. అజిత్, ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ కు ఈ దంపతులిద్దరూ ఫిదా అయ్యారు. 

దీనితో వెంటనే అజిత్ కు సూర్య పుష్ప గుచ్చం పంపి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమాని అభినందించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజిత్, జ్యోతిక గతంలో పలు చిత్రాల్లో నటించారు. 

ఇక నెర్కొండ పార్వయి చిత్రంలో జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించింది. ఆమె విడుదల రోజు చిత్రాన్ని అభిమానులతో కలసి వీక్షించింది. ప్రేక్షకుల రెస్పాన్స్ కు సంతోషంలో శ్రద్దా శ్రీనాథ్ ఎమోషనల్ అయింది. తమిళనాడులో ఈ చిత్ర వసూళ్లు భారీ స్థాయిలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది.