Asianet News TeluguAsianet News Telugu

ఏపీ టిక్కెట్ రేట్ల విధానంపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్

“ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 అది చాలా  నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు,” అంటున్నారు సురేష్ బాబు.

Suresh Babu comments on Ap Movie ticket rates
Author
Hyderabad, First Published Nov 27, 2021, 7:58 PM IST

రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే చేసిన  సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లు అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రతిపాదిస్తూ.. సినిమా థియేటర్లలో కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని పేర్కొంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇకపై నాలుగు షో లు మాత్రమే వేయాలని.. అదనపు షోలకు అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసేయటం కలవరం రేపుతోంది. ముఖ్యంగా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు ఉండాలని నిర్ణయించటం చాలా మంది నిర్మాతలకు నీరసం తెప్పిస్తోంది.అలాగే బెనిఫిట్ షోలు రద్దు నిర్ణయంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది.

ఇప్పటికే  మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సినిమా టికెట్ రేట్ల విషయంపై పునరాలోచించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తగ్గించిన టికెట్ ధరల్ని కాలానుగుణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని.. దేశమంతా ఒకటే జీఎస్టీగా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరల్లో అదే వెసులుబాటు ఉండటం సమంజసమని చిరు పేర్కొన్నారు.

  తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. ప్రస్తుత టికెట్ రేట్ల వల్ల నిర్మాతలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. సినిమా టిక్కెట్ రేట్లు పై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని అన్నారు.  “ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 అది చాలా  నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు,” అంటున్నారు సురేష్ బాబు.

“ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరుగుతోంది. ప్రొడక్ట్‌‌ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలలో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్‌పీరియన్స్ వేరు. కానీ ఆడియెన్స్ టేస్ట్ మారిపోతోంది,” అనేది ఆయన అభిప్రాయం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడమే చాలా కష్టంగా ఉందని.. ఇలాంటి సమయంలో రేట్లు తగ్గిస్తే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని.. అసలు సినిమా రిలీజ్ చేసే పరిస్థితే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బి సి సెంటర్స్ లో కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవని.. ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్లో వస్తువుని బట్టి ఒక్కో రేటు ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని వస్తువుల్ని కలిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా కుదురుతుందని సురేష్ బాబు ప్రశ్నించారు. పెద్ద సినిమాల బడ్జెట్ వేరు.. చిన్న సినిమాల బడ్జెట్ వేరు. రెండు సినిమాలకూ ఒకే రేటు నిర్ణయించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఇలాగైతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు భారీగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

టికెట్ రేటు ఇంత అని చెప్పలేం.. థియేటర్లో ప్రేక్షకులను బలవంతంగా కూర్చోబెట్టలేం. ఇష్టం లేకుండా టికెట్ కొనిపించలేం. ఇష్టమొచ్చినవాళ్లు చూస్తారు.. లేదంటే మానేస్తారు. అది కేవలం ప్రేక్షకుడి చేతుల్లో ఉంటుంది. మా సినిమా చూడమని ఎవరూ నిర్భందించలేరు కదా అని సురేష్ బాబు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చిత్ర పరిశ్రమని చిన్నచూపు చూస్తున్నాయని.. ఇలాగైతే ఇండస్ట్రీ మనుగడ సాధించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ప్రేక్షకులకు అన్ని రకాల వినోదాలు అందుబాటులో ఉన్నాయని.. సినిమా టిక్కెట్ ధరలపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios