న్యూజిలాండ్ లో వాలిపోయిన సురేఖ వాణి, బ్రహ్మానందం..కన్నప్పలో కమెడియన్లు, మోహన్ బాబు షాకింగ్ లుక్
కన్నప్ప షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే పూర్తి చేయనున్నారు. అవసరమైన నటీనటులందరినీ చిత్ర యూనిట్ న్యూజిలాండ్ పంపిస్తున్నారు.

మంచు విష్ణు కి చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. విష్ణు చివరగా నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప పాత్రలో నటించాలనేది మంచు విష్ణు కోరిక.
తన కలల ప్రాజెక్ట్ ని నెరవేర్చుకునే దిశగా మంచు విష్ణు అడుగులు పడుతున్నాయి. ఇటీవల శ్రీకాళహస్తిలో మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఈ చిత్ర షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే పూర్తి చేయనున్నారు. దీనితో అవసరమైన సెట్ మెటీరియల్, సామాగ్రిని ఇటీవల న్యూజిలాండ్ తరలించిన సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అయితే షూటింగ్ లో మంచు విష్ణు స్వల్పంగా గాయపడ్డారు. దీనితో విష్ణు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు.
అయితే అవసరమైన నటీనటులందరినీ చిత్ర యూనిట్ న్యూజిలాండ్ పంపిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా మంది కమెడియన్లు కూడా నటిస్తున్నారు. వారిలో బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు తో పాటు సురేఖ వాణి కూడా ఉన్నారు. వీరంతా ఇది వరకే న్యూజిలాండ్ చేరుకున్నారు.
న్యూజిలాండ్ లో సురేఖ వాణి మోహన్ బాబుతో కలసి తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కన్నప్ప చిత్రంలో భాగం అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ ఫొటోలో బ్రహ్మానందం ఇతర కమెడియన్లని కూడా చూడొచ్చు. ఈ ఫోటోలో మోహన్ బాబు పొడవైన గడ్డంతో షాకింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. కన్నప్ప చిత్రంలో మహా శివుడి పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.