ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ విడుదలపై ఈసీ స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదల కాకూడదని ఎన్నికల కమిషన్ వెల్లడించడంతో.. దర్శకనిర్మాతలు సుప్రీం కోర్టుని సంప్రదించారు.

దీంతో సుప్రీం కోర్టు నివేదిక సమర్పించాలని ఈసీని కోరింది. నివేదిక సమర్పించిన ఈసీ.. ఓటింగ్ పూర్తయ్యే వరకు ఆ సినిమా విడుదల మీద విధించిన నిషేధాన్ని ఆ నివేదికలో సమర్థించుకుంది. దాన్ని కేవలం ఒక బయోపిక్‌గా మాత్రమే చూడలేమని, ఒక రాజకీయ ప్రతినిధి మీద చేసిన ప్రశంసలకు సంబంధించిన చిత్రమని పేర్కొంది.

దీని కారణంగా ఓటింగ్ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఈ సినిమాలో ప్రతిపక్ష పార్టీలను తక్కువ చేసి చూపించారని, ఓటింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదలకు అనుమతించలేమని స్పష్టం చేసింది.

ఈ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు.. సినిమా విడుదల నిలుపుదలపై ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మోడీ బయోపిక్ విడుదలపై దాఖలైన పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో చిత్ర దర్శకనిర్మాతలకు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైంది.