సూపర్‌స్టార్ రజనీకాంత్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. రజనీకి చేసిన అన్ని వైద్య పరీక్షల్లో నివేదికలు నార్మల్‌గా వున్నాయని చెప్పారు.

ఇప్పటికే ఆసుపత్రి నుంచి ఆయన కుమార్తె ఐశ్వర్య వెళ్లిపోయారు. డిశ్చార్జ్ తర్వాత వారం పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అపోలో ఆసుపత్రి నుంచి రజనీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళతారు. 

కాగా, అన్నాత్తై సినిమా షూటింగ్ నిమిత్తం సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇక్కడే వుంటున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌లో పలువురికి పాజిటివ్‌గా తేలడంతో రజనీ సహా నటీనటులు, టెక్నీషియన్లకు కోవిడ్ టెస్టులు  చేశారు.

పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. దీంతో చెన్నైకి తిరిగి వెళ్లాలని రజనీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు.