హాస్యనటుడు సునీల్‌ టాప్‌ కమెడీయన్‌గా రాణిస్తున్న క్రమంలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. `అందాల రాముడు`తో హీరోగా నిరూపించుకున్నారు. `మర్యాద రామన్న`తో ఇక హీరోగా సెటిల్‌ అయిపోతాడని అంతా అనుకునేలా  చేశాడు. వరుసగా హీరోగా సినిమాలు చేసినా కలిసి రాలేదు. 

రెండేళ్ళ క్రితం `సిల్లీ ఫెలోస్‌`తో హీరోగా చివరి ప్రయత్నం చేసిన సునీల్‌ అది కూడా వర్కౌట్‌ కాకపోవడంతో హీరోగా  తాత్కాలికంగా బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ మాస్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కథతో ఓ సినిమాలో నటించబోతున్నారు. దీనికి `వేదాంతం రాఘవయ్య` అనే టైటిల్‌ని కూడా నిర్ణయించారు. 14రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. 

ఇందులో వేదాంతం రాఘవయ్య పాత్రలో సునీల్‌ కనిపించనున్నారు. వినోదం, విభిన్నమైన కథాంశాలు మేళవించిన ఈ సినిమా సునీల్‌ని హీరోగా నిలబెడుతుందని నిర్మాతలు అంటున్నారు. సునీల్‌ కూడా హీరోగా తనకిది చివరి ప్రయత్నంగానే భావిస్తున్నట్టు సమాచారం. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఇతర కాస్టింగ్‌ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మరోవైపు సునీల్‌ `కలర్‌ఫోటో` చిత్రంలో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.