వరుస సినిమాలు చేస్తూన్నా కలిసివచ్చే విషయమేమీ కనపడటం లేదు యంగ్ హీరో సందీప్ కిషన్. పేరుకు వరస ప్రాజెక్టులు కనపడుతున్నా కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయింది. విభిన్నమైన కథలు, కొత్త కాన్సెప్టులు ఎంచుకుంటూ సినిమాలు చేస్తానంటూ చేస్తున్న సినిమాలు భాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. ఈ నేపధ్యంలో రూట్ మార్చారు సందీప్ కిషన్. 

మిగతా హీరోల్లా రొటీన్ అనిపించినా..ఫార్ములా కథలు ఉన్నంతలో బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సందీప్ తాజాగా ఎంచుకున్న చిత్రం. కామెడీ సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ దర్శకుడుగా మారిన నాగేశ్వరరెడ్డి తన కొత్త సినిమాని ప్రకటించారు. అందులో సందీప్ కిషన్ హీరో.. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ కొత్త చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ అని, నాగేశ్వరరెడ్డి రెగ్యులర్ వేలో అంటే సిట్యువేషన్ కామెడీతో ఫన్నీగా సాగుతుందని చెప్తున్నారు. సందీప్ కిషన్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తిగా భిన్నంగా నడుస్తుందీ సినిమా. అల్లరి నరేష్ తో అనుకున్న కథని సందీప్ చేస్తున్నారని ఓ టాక్ కూడా నడుస్తోంది. అల్లరి నరేష్ కు ఈ కథ రొటీన్ అవ్వచ్చేమో కానీ సందీప్ కిషన్ కు కొత్తగా డిఫరెంట్ గా ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. 

ఇక గత కొద్దికాలంగా తెలుగు సినిమాలకు కాస్త దూరమైన హ‌న్సిక ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ముర‌ళి శ‌ర్మ, పృథ్వీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతన్న ఈ మొదటి సినిమాను అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 14న సినిమా ప్రారంభంతో పాటు అదే రోజు నుండి సినిమా సెట్ మీదకు వెళ్లనున్నట్టు తెలిపారు.

సందీప్ కిష‌న్, హ‌న్సిక‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్, పృథ్వీ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రం ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతోంది.  ఈ సినిమాకు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్న ఈ సినిమాకు క‌థ‌: రాజ‌సింహ, సంగీతం: శేఖ‌ర్ చంద్ర, సినిమాటోగ్ర‌ఫీ: శ‌్యామ్ కే నాయుడు, మాట‌లు: నివాస్, భ‌వానీ ప్ర‌సాద్.