జయం, 7జి బృందావన కాలనీ లాంటి చిత్రాల్లో నటించిన కమెడియన్ సుమన్ శెట్టిని అంత తొందరగా మరిచిపోలేం. హీరోతో కలసి అల్లరి వేషాలు వేస్తూ సుమన్ శెట్టి కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం సుమన్ శెట్టికి అవకాశాలు బాగా తగ్గాయి. సుమన్ శెట్టి ఇటీవల అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న అలీతో సరదా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. 

సుమన్ శెట్టి అలీతో అనేక సంగతులు పంచుకున్నాడు. తనకు కమెడియన్ గా బ్రేక్ ఇచ్చిన చిత్రం జయం అని సుమన్ శెట్టి తెలిపాడు. నాన్నతో పాటు షాప్ చూసుకునే నాకు నటుడు కావాలనే కోరిక ఉండేది. అలా జయం చిత్రం కోసం తేజ గారికి ఫోటోలు పంపా. అయన వెంటనే ఆడిషన్స్ కు పిలిచి ఎంపిక చేశారు అని సుమన్ శెట్టి తెలిపాడు. తేజ ఆర్టిస్టులని కొడతాడని టాక్ ఉంది. అదే విషయాన్ని సుమన్ శెట్టి కూడా ప్రస్తావించాడు. 

జయం చిత్రంలో షకీలాతో నటించే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. వాటిలో తేజ చెప్పిన ఎక్స్ ప్రెషన్స్ మొదట్లో రాలేదు. అందుకే ఒక్కటి పీకారు. దెబ్బకు ఆయన అనుకున్న విధంగా నటించా అని సుమన్ శెట్టి నవ్వుతూ తెలిపాడు. అల్లరి నరేష్ 'కితకితలు' చిత్రంలో గీతా సింగ్ హీరోయిన్ గా నటించింది. ఆమెకు, సుమన్ శెట్టికి మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

గీతా సింగ్, తనకు మధ్య ఏదో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె నాకు అక్కతో సమానం. అప్పట్లో మేమిద్దరం కలసి నటించాం.. పలు ఈవెంట్లలో పాల్గొనేవాళ్ళం. అందువల్లనే ఇలాంటి రూమర్స్ వచ్చాయని సుమన్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. గీత సింగ్ కూడా పలు సందర్భాల్లో ఈ రూమర్స్ ని ఖండించింది.