క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆర్ఆర్ఆర్ చిత్రం చూశాక రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. సుకుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
దర్శక ధీరుడు రాజమౌళి జైత్ర యాత్రలో మరో చిత్రం చేరింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఆర్ఆర్ఆర్ చిత్రానికి బ్లాక్ బ్లస్టర్ టాక్ మొదలయింది. తొలి రోజు వసూళ్లు కూడా కనీవినీ ఎరుగని విధంగా ఇండియాలోనే ఆల్ టైం రికార్డు సృష్టించబోతోంది.
ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్న్ వస్తుంటే.. సెలెబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వంతు వచ్చింది. అందరిలాగా రొటీన్ గా స్పందిస్తే ఆయన సుకుమార్ ఎందుకు అవుతారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం చూశాక సుకుమార్ కవితాత్మకంగా రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళిని ఉద్దేశిస్తూ సుకుమార్ చేసిన కామెంట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి. సుకుమార్ కామెంట్స్ చూసిన వారంతా పుష్ప డైరెక్టర్ స్టయిలే వేరు అంటున్నారు.
ఇంతకీ సుకుమార్ ఏమన్నారంటే.. 'మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి. మేము ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి. రాజమౌళి సార్.. మీకు మాకు ఒకటే తేడా.. మీరు ఇలాంటి సినిమా తీయగలరు.. మేము చూడగలం అంతే' అంటూ ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించారు.
రాజమౌళి, సుకుమార్ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అభిమానం ఉంది. తనకు ఇష్టమైన దర్శకుడు సుకుమార్ అని రాజమౌళి పలు సందర్భాల్లో తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లే పనిలో ఉన్నారు. గత ఏడాది విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది.
