టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోలలో సుధీర్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన ప్రతిభతోనే సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకున్నాడు.

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోలలో సుధీర్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన ప్రతిభతోనే సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకున్నాడు. ఎస్ఎంఎస్, ప్రేమ కథా చిత్రం, సమ్మోహనం లాంటి హిట్స్ సుధీర్ బాబు కెరీర్ లో ఉన్నాయి. గురువారంతో సుధీర్ బాబు హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు పూర్తవుతుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం `ఎస్ఎంఎస్` ( శివ మనసులో శృతి) 2012 ఫిబ్రవరి 10న విడుదలయింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు బుధవారం అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

కెరీర్ ఆరంభంలో అందరిలాగే తాను కూడా ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు సుధీర్ బాబు రివీల్ చేశాడు. తన తొలి సినిమా టైంలో సుధీర్ బాబు ఓ అవమానం ఎదురైందట. తొలి సినిమా కోసం ఎంతో కష్టపడి, డబ్బు కూడబెట్టుకుని సినిమా చేస్తున్నామని, అయితే షూటింగ్‌ మొదట్లోనే.. కెమెరామెన్‌ తన వాళ్లతో ఈ అబ్బాయి కెమెరా లుక్‌ లేదు, హీరోగా కష్టమని చెప్పారట. అది తనకు వినిపించిందని, దీంతో తన కార్వాన్‌లోకి వెళ్లి కాసేపు ఏడ్చానని తెలిపారు సుధీర్‌బాబు. 

అంతేకాదు తన చుట్టూ నెగటివిటీ ఉండకూడదని, ఆ వెంటనే ఆ కెమెరామెన్‌ని సినిమా నుంచి తీసేశాడట. రెండు మూడు సినిమాల తర్వాత తాను నిరూపించుకున్నాక అతన్ని మళ్లీ పిలిపించుకుని తన సినిమాలకు కెమెరామెన్‌గా పెట్టుకున్నానని సుధీర్‌బాబు తెలిపారు. అయితే ఆ మాటలు అప్పుడు బాధ కలిగించినా తనలో ఫైర్‌ని రగిలించాయని, తాను బాగా నటించాలనే కసిని పెంచాయని తెలిపారు సుధీర్‌బాబు. లుక్ వైజ్‌గా కనెక్ట్ కావడం కష్టమని తెలిసి, ఇక నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. అలా తొలి సినిమా తనకు మంచి పేరు తెచ్చిందన్నారు సుధీర్‌బాబు. 

అయితే తొలి సినిమా టైమ్‌లో వాయిస్‌పై కూడా విమర్శలు వచ్చాయన్నారు. తన డైలాగ్‌ డెలివరీ బాగా లేదని రివ్యూస్‌లో రాశారని, ఆ తర్వాత ఆర్పీ పట్నాయక్‌ ద్వారా వాయిస్‌ ఎక్సర్‌సైజ్‌లు చేసినట్టు చెప్పారు. ఇప్పటికీ తాను డబ్బింగ్‌ చెప్పడం వెంటనే చేయనని, రెండు మూడు రోజులు వాయిస్‌ ప్రిపరేషన్‌ చేసుకుని డబ్బింగ్‌ చెబుతానని తెలిపారు సుధీర్‌బాబు. మరోవైపు `బాఘి`చిత్రంలో సుధీర్ బాబు విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సుధీర్ బాబు ఓ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు. 

రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రలో నటించే అవకాశం మొదట సుధీర్ బాబుకి వచ్చింది. కానీ ఆ ఆఫర్ ని తానూ రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఇంద్రగంటిగారితో `సమ్మోహనం` ఆఫర్‌ వచ్చిందని, ఇది చాలా కూల్‌గా సాగే మూవీ అని, విలన్‌గా చేశాను, కానీ ఇలాంటి సెటిల్డ్ నటన చూపించే సినిమా చేయలేదని అందుకే `బ్రహ్మస్త్ర` రిజక్ట్ చేసి `సమ్మోహనం` ఓకే చేశానని తెలిపారు సుధీర్‌బాబు. 

సుధీర్ బాబు చివరగా `శ్రీదేవి సోడా సెంటర్` చిత్రంలో నటించాడు. అది పర్వలేదనిపించింది. ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే మూవీ చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సినిమా బేస్డ్ గానే సాగుతుంది. `సమ్మోహనం` చిత్రానికి నెక్ట్స్ లెవల్‌గా ఉంటుందన్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఐదు సినిమాలకు కమిట్‌ అయినట్టు తెలిపారు సుధీర్‌బాబు. ఇకపై సినిమాల పరంగా స్పీడ్‌ పెంచబోతున్నట్టు తెలిపారు. నటుడిగా ఈ పదేళ్లలో పెద్దగా రిగ్రెట్స్ లేవని, ప్రతి సినిమాతో నేర్చుకుంటూ వస్తున్నానని చెప్పారు. ప్రతి సినిమాకి తన వంద శాతం ఇస్తున్నానని చెప్పారు. కాకపోతే ఒక బిగ్‌ బ్రేక్‌ లాంటి సినిమా పడాలని కోరుకుంటున్నట్టు తన మనసులోని మాటని తెలిపారు సుధీర్‌బాబు.