అన్ స్టాపబుల్ సీజన్ 3 రంగం సిద్ధం అవుతుండగా... ఈసారి చిరంజీవిని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారట. ఈ మేరకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ టాక్.  

సిల్వర్ స్క్రీన్ పై సింహంలా గర్జించే బాలకృష్ణ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం నిరాశపరిచేవారు. ఆయన పబ్లిక్ స్పీచ్లు పలుమార్లు ట్రోల్స్ కి గురయ్యాయి. బాలకృష్ణ ఫ్లో అంతగా బాగోదు. మాట్లాడేటప్పుడు పదాలు వెతుక్కుంటారు. ఒక్కోసారి మాటలు గలగలా పారిస్తారు. మరోసారి అసలు మాట్లాడలేక ఇబ్బందిపడతారు. అలాగే బాలయ్యకు షార్ట్ టెంపర్. కోపం వస్తే అభిమానులను కూడా కొట్టేస్తాడు. ఈ క్రమంలో బాలయ్య హోస్ట్ గా సక్సెస్ కావడం కల్లే అనుకున్నారు. 

బాలయ్య వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ టాక్ షో ప్రకటించగా చాలా మంది పెదవి విరిచారు. అందరి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టాడు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్ 1, 2 సూపర్ సక్సెస్ అయ్యాయి. భారీ టీఆర్పీతో నేషనల్ వైడ్ రికార్డు నెలకొల్పాయి. బాలయ్య మాటతీరు, మేనరిజమ్స్, ప్రశ్నలు ప్రత్యేకంగా నిలిచాయి. 

ఇక బాలయ్య మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ ని ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఆయన ఇంటర్వ్యూ చేయాల్సిన క్రేజీ స్టార్స్ ఇంకా మిగిలే ఉన్నారు. వారిలో చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి వారున్నారు. కాగా చిరంజీవితో బాలయ్య ఎపిసోడ్ కి రంగం సిద్దమైందన్న మాట వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్ 3లో బాలయ్య చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడం అనివార్యం అట. ఈ మేరకు చిరంజీవిని ఒప్పించారట. 

చాలాకాలం తర్వాత ఒకే వేదికపైకి చిరంజీవి-బాలయ్య రానున్నారట. ఇక అన్ స్టాపబుల్ షో అంటే గెస్ట్ జీవితంలోని కాంట్రవర్సీని తెరపైకి తెస్తాడు బాలయ్య. మరి ప్రజారాజ్యం ప్రస్తావన దాని వైఫల్యం గురించి ప్రశ్నించకపోతే ఇంటర్వ్యూ అసంతృప్తిగా గా ఉంటుంది. ఆ విషయం మాట్లాడాల్సి వస్తే చిరంజీవి పొలిటికల్ ఫెయిల్యూర్ పై బాలయ్య చేసిన కామెంట్స్ గురించి కూడా అడగాలి. చిరంజీవిని ఉద్దేశిస్తూ బాలకృష్ణ గతంలో మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. బాలయ్య తీరును నాగబాబు 2019 ఎన్నికలకు ముందు సిరీస్ ఆఫ్ వీడియోలతో ఎండగట్టే ప్రయత్నం చేశాడు. 

కాబట్టి బాలయ్యను చిరంజీవి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే చాలా వ్యవహారాలు ప్రస్తావించాలి. అయితే అంత లోతుకు పోకపోవచ్చు. ఎవరి ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కానిచ్చేయవచ్చు. పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే జరిగింది. చిరంజీవి ఫ్యామిలీపై బాలయ్య చేసిన కామెంట్స్ వదిలేసి కేవలం వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్యాకేజీ ఆరోపణ గురించి చర్చించి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య-పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ టీడీపీ, జనసేన పొలిటికల్ మైలేజ్ కోసం ఉద్దేశించినదిగా సాగింది. మరి చూడాలి బాలయ్య బోల్డ్ షోకి చిరంజీవి వస్తే ఏం జరుగుతుందో...