రెగ్యులర్ పెట్టే టైటిల్స్ కు త్రివిక్రమ్ మొదట నుంచీ దూరం. ముఖ్యంగా అచ్చ తెలుగు టైటిల్ ని తన సినిమాకు పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తూంటారు. ఆ మధ్యన వచ్చిన అత్తారింటికి దారేది, రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ వంటి టైటిల్స్ ఆ విషయాన్ని మనకు చెప్తాయి. తెలుగు సంప్రదాయం ప్రతిధ్వనిస్తూనే, కథకు లింక్ ఉండేలా టైటిల్స్ ని ఖరారు చేస్తూంటారు. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి టైటిల్ తోనే ఆయన ముందుకు వస్తున్నారు. ఆ టైటిలే ‘ అల వైకుంఠ పురంబులో’. ఈ టైటిల్ ఫిక్స్ చేయటానికి సరైన కారణం ఉందని సమాచారం.

ఈ టైటిల్ వెనక కథ ఏమిటంటే...సినిమాలో టబు ఉండే ఇంటి పేరు ‘వైకుంఠ పురం’. ఆ ఇంట్లోనే ఎక్కువ భాగం కథ నడుస్తుంది. అందుకోసమే ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఆ ఇంటి సెట్ వేసారు. దాంతో అక్కడ జరిగే కథ కాబట్టి ‘ అల వైకుంఠ పురంబులో’ అనే టైటిల్  ఫిక్స్ చేైసినట్లు సమాచారం. అలాగే అ సెంటిమెంట్ కూడా ఈ టైటిల్ కు కలిసివస్తోంది. అత్తారింటికి దారేది, అ...ఆ, అరవింద సమేత, అజ్ఞాతవాసి..ఇలా అ మొదటి అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ తన సినిమాలకు పెడుతున్న త్రివిక్రమ్ అదే ట్రెండ్ ని ఈ సినిమాకు కంటిన్యూ చేయటం విశేషం.

ఇంతకీ ‘ అల వైకుంఠ పురంబులో’ అనేది ఎక్కడిదో గుర్తు వచ్చిందా...పోతనామాత్యులు రాసిన భాగవతంలోని....గజేంద్ర మోక్షంలోనిది. ఫ్యామిలీలను ఖచ్చితంగా ఈ టైటిల్ ఎట్రాక్ట్ చేస్తుంది. బన్ని సినిమా అంటే మాస్ కు  పండగే. ఇక త్రివిక్రమ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లంతా ...థియోటర్స్ దగ్గర ఖచ్చితంగా రిలీజ్ రోజు కనపడతారు. టైటిల్‌ను స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.  

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నవదీప్ మరో నెగిటివ్ రోల్ లో కనిపించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.   సంక్రాంతి 2020కు ఈ చిత్రం విడుదల కానుంది.