ప్రముఖ తెలుగు, తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శివకి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి జయకుమార్ వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివ ఇప్పుడు కోలీవుడ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.

 అయితే జయకుమార్‌ దాదాపు నాలుగు వందలకుపైగా షార్ట్ ఫిల్మ్ లకు, డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఫోటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపుని, పేరుని సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వేలన్‌ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. ఆయన నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 

ఇక జయకుమార్‌కి ఇద్దరు కుమారులుండగా, పెద్ద కుమారుడు శివ దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. చిన్న కుమారుడు బాలా మలయాళ చిత్ర పరిశమ్రలో నటుడిగా రాణిస్తున్నారు. శివ సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. తెలుగులో ఆయన `శ్రీరామ్‌`, `నేనున్నాను`, `మనసు మాట వినదు`, `గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ`, `బాస్‌` వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు శివ. 

ఆ తర్వాత గోపీచంద్‌ హీరోగా రూపొందిన `శౌర్యం` చిత్రంతో దర్శకుడిగా మారారు. `శంఖం`, `దరువు` చిత్రాలను తెలుగులో రూపొందించారు. తెలుగులో సరైన గుర్తింపు రాకపోవడంతో తమిళంలోకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ కార్తీ హీరోగా `సిరుతాయ్‌`, ఆ తర్వాత స్టయిలీష్‌ హీరో అజిత్‌తో `వీరం`, `వేదాళం`, `విశ్వాసం`, `వివేగం` వంటి చిత్రాలను రూపొందించి కమర్షియల్‌ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌ హీరోగా `అన్నాత్తే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో తన తండ్రి మరణించడంతో శివ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక జయకుమార్‌ ఆత్మకి శాంతి చేకూరాలని తమిళ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.