కర్ణాటక ఎలక్షన్స్ లో.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి భాగస్వామి కాబోతున్నారు. ఈ విషయంలో రాజమౌళి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు రాజమౌళికి.. ఎలక్షన్స్ కు సబంధం ఏంటి. .? అది కూడా కన్నడ ఎలక్షన్స్ లో జక్కన ఏం చేయబోతున్నారు..?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్, కోలీవుడ్ హవాసాగుతున్న టైమ్ లో.. తెలుగు సినిమాకు చెయ్యందించి పైకి లేపిన దిగ్గజ దర్శకుడు జక్కన్న. భారీ బడ్జెట్ సినిమాకు ఊపిరిపోసిన ఈ దర్శకుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేశారు. తెలుగు సినిమాను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళాడు జక్కన్న. ఈక్రమంలో పాన్ ఇండియా లెవల్లో ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది. హీరోలను మించిన స్టార్ డమ్ తో.. దూసుకుపోతున్న రాజమౌళి, ఇప్పటికే ఎన్నో గౌరవాలు అందుకున్నారు. తాజాగా ఆయన్ను స్టార్ క్యాంపేయినర్ గా నియమించారు కర్నాటక అధికారులు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా దిగ్గజ దర్శకుడు రాజమౌళిని తీసుకోవాలి అని నిర్ణయించారు ఆ జిల్లా కలెక్టర్. ఈజిల్లాలో ఓటింగ్ శాతం పెంపు కోసం అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్ నాయక్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించామని, అందుకు రాజమౌళి సరైన వ్యక్తి అని భావించినట్టు అధికారి వెల్లడించారు.
అయితే ఈ కార్యక్రమం కోసం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని సెలక్ట్ చేయడం వెనుక ఓ కారణం ఉంది. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంపులోనే రాజమౌళి జన్మించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయనతో ప్రచారం చేయిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రాజమౌళి పేరును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేశామని.. ఈ విషయంలో రాజమౌళిని సంప్రదించగా.. ఆయన కూడా అందుకు అంగీకరించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా రాజమౌళి ప్రత్యక్షంగానే కాకుండా..వీడియో సందేశాల ద్వారా ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి ఆస్కార్ హడావిడిలో ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికాలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ లు ఏర్పాటు చేస్తూ.. హడావిడి చేస్తున్నారు జక్కన్న టీమ్. ఇప్పటికే ఎన్నో అవార్డులు సాదించిన ట్రిపుల్ ఆర్ టీమ్.. మరిన్ని అవార్డులు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈనెల 12న ఆస్కార్ అవార్డ్ ల వేడుక అమెరికాలో అట్టహాసంగా జరగబోతోంది. ట్రిపుల్ ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఈపాటకు ఆస్కార్ పక్కా అంటున్నారు సినీ జనాలు.
