హాస్య నటుడు బ్రహ్మనందంకు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో సాన్నిహిత్యం ఉంది. బ్రహ్మి స్టార్ కమెడియన్ గా దశాబ్దాల కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు. ఇటీవల కాస్త జోరు తగ్గినప్పటికీ బ్రహ్మానందం కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం బ్రహ్మానందం హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. 

బ్రహ్మానందం తనకు భోజనం వడ్డిస్తున్న ఫోటోని హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ ఫోటో ప్రస్తుతం నెటిజన్లని ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం ప్రతి రోజు ఇంటి నుంచి సెట్స్ కు భోజనం తెప్పించుకుంటారు. పనిచేసే సమయంలో కొలీగ్స్ తో కలసి లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం సహజమే. 

తాజాగా తన ఇంటి నుంచి తెచ్చుకున్న వివిధ వంటకాల్ని బ్రహ్మి హరీష్ శంకర్ కు వడ్డించారు. దీని గురించి హరీష్ ట్వీట్ చేస్తూ.. ఎంతమందికో ఈ అదృష్టం అని హరీష్ పేర్కొన్నాడు. పైగా ఈ రోజు వాల్మీకి చిత్ర షూటింగ్ చివరి రోజు అని హరీష్ తెలిపాడు. హరీష్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో బ్రహ్మీ నటించిన సంగతి తెలిసిందే. 

బ్రహ్మానందం లంచ్ బాక్స్ గురించి గతంలో కూడా అనేక వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్స్ కూడా సెట్స్ లో లంచ్ బాక్స్ ని బ్రహ్మీతో కలసి షేర్ చేసుకునేవారట.