బ్రహ్మనందం ఇంట పెళ్లి సందడి.. సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన స్టార్ నటుడు..
స్టార్ కమెడియన్, సీనియర్ నటుడు బ్రహ్మనందం ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఇన్విటేషన్ కార్డు అందించారు.
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ ఏడాది మే22న బ్రహ్మనందం చిన్న కొడుకు సిద్ధార్థ్ (Siddharth Kanneganti) నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్ మెంట్ కు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు కూడా హాజరయ్యారు.
ఇక ప్రస్తుతం పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అతిథులను బ్రహ్మనందం ఆయన సతీమణితో కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు. ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు హాజరవ్వాలని కోరారు. పెళ్లి వేడుక హైదరాబాద్ లో జరగనుందని తెలియజేసి వివాహ పత్రికను అందజేశారు.
ఇక సిద్ధార్థ్ కి కాబోయే భార్య పేరు ఐశ్వర్య. ఈమె వృత్తిరీత్యా డాక్టర్ అని తెలుస్తోంది. వీరి పెళ్లి తేదీలను తెలియజేయలేదు. హైదరాబాద్ లో గ్రాండ్ గా పెళ్లి వేడుక జరగనుంది. ఇక బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు కాగా సిద్దార్థ్ చిన్నవాడు. విదేశాల్లో చదువుకున్న గౌతమ్ అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు వినికిడి. సిద్ధార్థ్ గురించి పెద్దగా తెలియదు. అతడు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. పెద్ద కొడుకు రాజా గౌతమ్ సుపరిచితుడే. 2004లో విడుదలైన పల్లకిలో పెళ్లి కూతురు మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. అనంతరం బసంతి, మను, బ్రేక్ అవుట్ వంటి సినిమాలు చేశారు.
ఇక బ్రహ్మనందం చివరిగా ‘రంగమార్తాండ’ చిత్రంతో అలరించారు. ఆయన అద్భుతమైన నటనకు ప్రశంసల జల్లు కురిసింది. భారీ ఎత్తున సన్మానాలు కూడా చేశారు. ఇక రీసెంట్ గా ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. రెండేళ్ల కింద అనారోగ్యం బారినపడటంతో సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ‘రంగమార్తాండ’తో మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించారు.