థమన్ కు మరోసారి చేజారిన మెగా ఆఫర్ సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ గతంలో బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ ఎంట్రీకి మ్యూజిక్ ఇచ్చిన థమన్
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వెలువడిన ‘సై.. రా… నరసింహారెడ్డి’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. కానీ సంగీత దర్శకుడు థమన్ మాత్రం నిరాశకు గురయ్యాడు. నిజానికి సైరా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ స్కోర్ థమన్ అందించాడు. అంతే కాదు గతంలో 'బ్రూస్ లీ' సినిమాలో చిరు ఎంట్రీ సీన్‌కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టిన థమన్.. పూర్తి సినిమాకు మాత్రం ఛాన్స్ మిస్ అయ్యాడు.
సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్ సినిమాతో తొలి విజయం అందుకున్న థమన్ అనతికాలంలోనే మంచి గుర్తింపును పొందారు. అటుపై రామ్ చరణ్ నటించిన 'నాయక్' సినిమాతో తొలిసారి మెగా కాంపౌండ్లో చేరిన థమన్ "రేసుగుర్రం, బ్రూస్లీ" వంటి సినిమాలకి బాణీలు సమకూర్చాడు. ఇటు సురేందర్‌తోనూ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన థమన్ మెగాస్టార్-స్టైలిష్ డైరెక్టర్ కలయికలో రానున్న సినిమా తనకు మైలురాయిగా నిలుస్తుందని భావించాడు. పైగా ఆ మధ్య ఓ ఆడియో రిలీజ్‌లో తన తదుపరి చిత్రానికి థమన్ కు అవకాశం ఇస్తానని చిరు కూడా ప్రకటించడంతో థమన్ ఈ సినిమాపై భారీ ఆశలే పెంచుకున్నాడు.
కానీ ఈ సినిమా ప్రాంతీయ హద్దులను చెరిపి తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ప్లాన్ చేయటంతో.. అనూహ్యంగా ఈ చిత్రం స్థాయి పెరిగింది. ఫలితంగా చెర్రీ అండ్ టీమ్ దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన సాంకేతిక వర్గం, నటీనటులను ఎంపిక చేయడంతో థమమ్‌కు స్థానం కరువైంది. అయితే విడుదలైన ప్రచార చిత్రానికి మాత్రం థమన్ సంగీతం అందించడం విశేషం. ఈ సినిమా అవకాశం తనకు లభించనప్పటికీ చెర్రీ, సూరిలతో గల సాన్నిహిత్యం వలనే థమన్ ఇందుకు అంగీకరించినట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ థమన్ కు గట్టి దెబ్బే తగిలిందని ఇండస్ట్రీలో అనుకుంటున్నా... థమన్ మాత్రం మోషన్ పోస్టర్ సక్సెస్ క్రెడిట్ తనదేనంటున్నాడు.
