శ్రీను వైట్లకు కొన్నేళ్లుగా కాలం కలిసిరాలేదు. ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. ఆర్థికంగాను నష్టాలు. వరుసగా మూడు సినిమాల ఫ్లాపయ్యాయి. చాలా రోజులకు ఒక సినిమాను సంపాదించగలిగాడు. అదే అమర్ అక్బర్ ఆంటోనీ. అయితే ఆ సినిమాకు ఆయన కేవలం దర్శకుడే కాదట కో ప్రొడ్యూసర్ అని కూడా తెలుస్తోంది. 

ఆగడు బ్రూస్ లీ మిస్టర్... ఈ మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో శ్రీను వైట్లను పలకరించే వాళ్లే లేకపోయారు. అతనితో సినిమా చేసేందుకు ఏ హీరో ఇష్టపడలేదు. ఏ నిర్మాత ముందుకు రాలేదు. మొత్తమ్మీద ఓ పవర్ ఫుల్ కథతో రవితేజను ఒప్పించాడు శ్రీనువైట్ల. ఆ సినిమాను చేసేందుకు మైత్రీ మూవీస్ బ్యానర్ అంగీకరించింది. అయితే పెద్దగా ఏమీ డబ్బులు మాత్రం పెట్టదు. శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు చాలా ఏళ్ల క్రితమే రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చింది. దీంతో శ్రీను వైట్ల ఇప్పుడు ఈ సినిమాకు తాను కూడా కోప్రొడ్యూసర్ గా ఉండబోతున్నట్టు సమాచారం. శ్రీనుతో సినిమా చేయడమే ఎక్కువ... ఇక పెట్టుబడి కూడానా అన్నట్టు మైత్రీ మూవీస్ ప్రవర్తిస్తోందని అంటున్నారు సినీజనాలు. 

అమర్ అక్బర్ ఆంటోనీ కథపై చాలా ఆశలు పెట్టుకున్నాడు శ్రీను వైట్ల. ఆ సినిమా మళ్లీ తనను మంచి దర్శకుడిగా నిలబెడుతుందని నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా కాజల్ ను సంప్రదించాడు వైట్ల. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో... అను ఇమ్మాన్యుయేల్ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అది నిజం కాదని చిత్రయూనిట్ తెలిపింది. ఒకే వ్యక్తి... మూడు వ్యక్తిత్వాల కింద కనిపిస్తాడని చెప్పింది. ఈ సినిమా కానీ హిట్ కొట్టలేదో... శ్రీను వైట్ల చరిత్ర ముగిసిపోయినట్టే.