అందం, అభినయంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక ముద్రవేసింది ‘అతిలోక సుందరి’ శ్రీదేవి. నిజంగానే ఇంద్రలోకం నుంచి దిగొచ్చిన దేవ కన్యలా అనిపిస్తుందామె. తన పాత్ర ప్రాధాన్యం, నిడివి వంటి అంశాలను జాగ్రత్తగా గమనించుకున్నాకే శ్రీదేవి ఏ చిత్రానికైనా సంతకం చేసేదట. పాత్రల ఎంపికలో అంత నిక్కచ్చిగా వ్యవహరించే ఈమె ఓ సంచలన సినిమాన్ని వదులుకున్నారు. 1993లో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జురాసిక్‌ పార్క్’‌లో ఓ పాత్రను పోషించాల్సిందిగా దర్శకుడు శ్రీదేవిని కోరగా అమె మొదట ఒప్పుకొంది. అయితే అప్పటికే  భారత సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్న ఈమె హాలీవుడ్‌కి వెళ్లే ఆలోచన లేకపోవడంతో ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిందట. 

 

తరవాత ఆ పాత్రకు హాలీవుడ్‌ నటి ఏరియానా రిచర్డ్స్‌ను తీసుకున్నారట. తర్వాత ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో ఆ పాత్రను వదులుకున్నందుకు శ్రీదేవి బాధపడిందట. అయితే ఆమెకి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను తిరస్కరించడం ఇదేం తొలిసారి కాదు. 1993లో షారూక్‌ ఖాన్‌, సన్నీడియోల్‌, జుహీ చావ్లా ప్రధాన తారగణంగా తెరకెక్కిన ‘డర్‌’లో కథానాయికగా మొదట శ్రీదేవినే సంప్రదించారు. తెలుగు సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి‌’ రెండు భాగాల్లో  శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవినే అనుకున్నారు. ఆమె కాదనడంతో ఆ అవకాశం రమ్యకృష్ణను వరించింది.