కుర్ర నటుడు శ్రీవిష్ణు హీరోగానే కాకుండా ఫ్రెండ్ క్యారెక్టర్ లలో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతడి సినిమాలకు బిజినెస్ ఓ మోస్తరుగా జరుగుతుంటుంది. తాజాగా అతడు నటించిన 'బ్రోచేవారెవరురా' సినిమా బిజినెస్ కూడా అంతంతమాత్రంగానే జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఈ సినిమాపై కాస్త హైప్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో జనాల్లోకి ఈ సినిమాను తీసుకువెళ్లలేకపోతున్నారు. అలాంటి ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఏకంగా మూడు కోట్ల రూపాయలకు శాటిలైట్ రైట్స్ ని అమ్మినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాను ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి. విడుదలకు ముందే శ్రీవిష్ణు సినిమాకి శాటిలైట్ డీల్ పూర్తవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పటికీ శ్రీవిష్ణు నటించిన చాలా సినిమాలు శాటిలైట్ కి నోచుకోకుండా పడి ఉన్నాయి.

అలాంటిది అతడు నటించిన 'బ్రోచేవారెవరురా' సినిమా విడుదలకు ముందే ఇలా అమ్ముడిపోయిందంటే చెప్పుకోదగ్గ విషయమే.. సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో శాటిలైట్ రైట్స్ కి ఈ రేంజ్ లో ఆఫర్ వచ్చిందని అంటున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది.