టాలీవుడ్ ‘సిల్లీ’ సెన్సేషన్ శ్రీరెడ్డికి పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయా? తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోతోందా? ‘ఇలా అయితే ఆమె వెంట ఎవ్వరూ వుండరు’, ‘ఆమె చేసే పనులు ఆమెనే సమాజ బహిష్కరణ వైపు తరిమేట్టున్నాయి..’ అంటూ వినిపిస్తున్న ‘శ్రీరెడ్డి సానుభూతిపరుల’ మాటలు ఆమె తాజా అవస్థను తెలియజేస్తున్నాయి. అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ బైటపడ్డ నేపథ్యంలో శ్రీరెడ్డి పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్.. ఆమెను ఈ విధంగా కార్నర్ చేస్తోంది.

‘అమెరికాలో వీళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారు’ అంటూ ఇటీవల 34 మంది ఫిమేల్ సెలబ్రిటీల పేర్లను బయటపెట్టింది శ్రీరెడ్డి. తన అసలు ఉద్దేశాన్ని ఇదమిద్ధంగా చెప్పకపోయినప్పటికీ.. సెక్స్ రాకెట్లో వీళ్ళందరి ప్రమేయం ఉందన్న భావన కల్గించేలా వుందా పోస్ట్. ఇటువంటి వ్యవహారాల్లో ‘బాధిత మహిళల’ పేర్లు, వివరాలు బైటికి చెప్పకూడదన్న సామాజిక ఉద్దేశాన్ని దెబ్బతీసేలా శ్రీరెడ్డి ప్రవర్తించిందంటూ ఒక వర్గం మొత్తం ఆమెను టార్గెట్ చేస్తోంది. ఆమె పేర్కొన్న ఆ 34 మంది ఆడవాళ్లు మానసిక క్షోభకు గురవుతున్నారని, తప్పు చేశారో లేదో తేలకముందే వాళ్ళ వివరాలు బహిర్గతం కావడం దారుణమైన విషయమని సామాజికవేత్తలు వాదిస్తున్నారు.

అంతకుముందు.. కాస్టింగ్ కౌచ్ అంశంపై శ్రీరెడ్డి చేసిన పోరాటానికి బాసటగా నిలిచిన మహిళా సంఘం నేత సంధ్య, సామాజిక జర్నలిస్ట్ సజయ కాకర్ల లాంటి వాళ్లంతా ఇప్పుడు శ్రీరెడ్డి వైపు తమ విమర్శన బాణాలు ఎక్కుపెడుతున్నారు. బాధిత మహిళల విషయంలో మీడియా సైతం గోప్యత పాటించేలా తాము ఒత్తిడి తీసుకొస్తుంటే.. ఈ అమ్మాయి చివరకు ఇలా చేసిందేమిటి? దాదాపు సగం తెలుగు గ్లామర్ ప్రపంచాన్ని తలెత్తుకోనివ్వకుండా చేసిన శ్రీరెడ్డిని ఈ విషయంలో క్షమించే ప్రసక్తే లేదు.. అంటూ సౌండ్ పెంచుతున్నారు. ”వాళ్ళందరూ సాటి ఆడవాళ్లన్న కనీస సానుభూతి కూడా లేకపోయింది శ్రీరెడ్డికి..” అన్నది సామాజికవేత్తల సూటి ప్రశ్న.