మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్టైన్‌మెంట్స్ లో ఓ సినిమా రూపొందుతుంది. ఇందులో శ్రీలీల కథానాయిక. తాజాగా సినిమాలోని ఆమె పాత్రని రివీల్ చేసింది యూనిట్.
యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఇప్పుడు వరుస సినిమాలతో జోరుమీదుంది. ఆమె చేతిలో ఏడెనిమిది సినిమాలున్నాయి. స్టార్ హీరోల నుంచి, యంగ్ స్టర్స్ వరకు అందరితోనూ నటిస్తుంది. బ్యాక్ టూబ్యాక్ అలరించేందుకు వస్తుంది. అందులో భాగంగా `ఉప్పెన` ఫేమ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తుంది. `పీవీటీ04` వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుందని, రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో కథ సాగుతుందని తెలుస్తుంది.
ఇందులో వైష్ణవ్ తేజ్‌కి జోడీగా శ్రీలీల కనిపిస్తుంది. తాజాగా సినిమాలోని ఆమె పాత్రని రివీల్ చేసింది యూనిట్. ఇందులో శ్రీలీల `చిత్ర`గా కనిపించబోతుందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్లజెంట్ లుక్‌లో ఆకర్షించేలా ఉంది శ్రీలీల. ఎంతో క్యూట్‌గా, ఎంతో అందంగా కనిపిస్తుంది. సినిమాలో కూడా తాను ఉల్లాసభరితంగా, కొంటెగా ఉంటూ అందరి మనసులు దోచుకునే అందమైన 'చిత్ర'గా కనిపిస్తుందట. తాను పోషిస్తున్న చిత్ర పాత్ర పట్ల శ్రీలీల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటిదాకా చిత్రీకరించిన ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని చిత్ర బృందం తెలిపింది.
అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా అదిరిపోయే యాక్షన్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. `శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సినిమాకి కీలకమైన పవర్ ఫుల్ పాత్రలలో జోజు జార్జ్, అపర్ణా దాస్ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను పెంచేశాయి.
`అసురన్`, `ఆడుకలం` వంటి జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో చేతులు కలిపారు. ఇటీవల వీరి కలయికలో వచ్చిన `సార్/వాతి` చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఎ.ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. PVT04 నుంచి సోమవారం (మే 15) సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది.
`జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. క్రూరత్వంతో కూడిన ఆయన పవర్ ఫుల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పంజా వైష్ణవ్ తేజ్‌కి, జోజు జార్జ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్రబృందం చెబుతోంది. వైష్ణవ్ తేజ్ పాత్రను పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ ఇంకా విడుదల చేయాల్సి ఉందని, అది ప్రేక్షకుల అంచనాలకు మించేలా ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్నాన్ని సితా ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని త్వరలోనే థియేటర్లోకి తీసుకొచ్చేందుకు యూనిట్ ప్లాన్ చేస్తుందట.
