బాహుబలిపై స్పందించాలంటే టైమ్ రావాలట అతిలోక సుందరికి ఆ మాత్రం సమయం పడుతుంది తెలుగు అభిమానులకు దూరమయ్యే  విధంగా శ్రీదేవి చేష్టలు

దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమాలోని కీలకమైన శివగామి పాత్రకు ముందుగా శ్రీదేవినే అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మితిమీరిన కోరికలు కోరడంతో ఆమెను వద్దనుకుని, రమ్యకృష్ణను తీసుకున్నారు. ఆ పాత్రలో రమ్యకృష్ణ ఎంతలా చెలరేగిపోయి నటించిందో తెలిసిందే. శ్రీదేవి చాలా ఎక్కువగా డిమాండ్‌ చేసిందని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించారు.

ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన విషయాలు జాతీయ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో శ్రీదేవి ఎక్కడకు వెళ్లినా.. ఆమెకు ‘బాహుబలి’ గురించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వేడుకలో ‘శివగామి పాత్రను ఎందుకు వదిలేసుకున్నారు’ అనే ప్రశ్న శ్రీదేవికి ఎదురైంది. దానికి శ్రీదేవి ‘సమయం వచ్చినపుడు ‘బాహుబలి’ గురించి స్పందిస్తా.. ఇప్పుడేం మాట్లాడలేను’ అని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం నటిస్తున్న ‘మామ్‌’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల కోసం త్వరలోనే మీడియా ముందుకు రాబోతున్నారు శ్రీదేవి. అప్పుడు బాహుబలి గురించి ప్రశ్నలు రాక మానవు. శ్రీదేవి దాని గురించి స్పందించాల్సిన అవసరం రాక మానదు.

ఇప్పటికే బాహుబలిని వదులుకున్న శ్రీదేవి.. దాసరి మృతి పట్ల స్పందించలేదన్న అపవాదు కూడా మీద వేసుకుంది. దీనికి తోడు సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని శ్రీదేవి రాజకీయ నాయకుల్లా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.