మరో హాలీవుడ్‌ చిత్రం విడుదల కాబోతుంది. రేపు శుక్రవారం(ఫిబ్రవరి 18)ని `అన్‌ఛార్టెడ్‌` అనే సినిమా విడుదల కాబోతుంది. `స్పైడర్‌ మ్యాన్‌` చిత్రాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న టామ్‌ హోలెండ్‌ ఈ సినిమాలో హీరోగా నటించడం విశేషం.

తెలుగు సినిమాలు, బాలీవుడ్‌ చిత్రాలు విదేశాల్లోనూ సత్తాచాటుతున్నాయి. `బాహుబలి`, `దంగల్‌` చిత్రాలు, అలాగే రజనీకాంత్‌ మూవీస్‌ విదేశాల్లో సందడి చేస్తుంటాయి. పాన్‌ ఇండియా సినిమా వచ్చాక అంతర్జాతీయ మార్కెట్‌ మనకు అనుకూలంగా మారుతుంది. అయితే అంతకు ముందు నుంచే హాలీవుడ్‌ చిత్రాలు ఇండియన్‌ బాక్సాఫీసుని టార్గెట్‌ చేశాయి. `అవెంజర్‌`, `అవతార్‌`, `స్పైడర్‌మ్యాన్‌`, `స్టార్‌వార్స్`, `ఐరన్‌ మ్యాన్‌` వంటి చిత్రాలు ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో విడుదలవుతూ అలరిస్తుంటాయి. భారీ యాక్షన్‌ సీక్వెన్స్, విజువల్‌ వండర్‌గా ఉండటంతో చిన్న పిల్లల నుంచిపెద్ద వాళ్ల వరకు హాలీవుడ్‌ సినిమాలకు అలవాటు పడుతున్నారు. 

ఈ క్రమంలో ఆయా చిత్రాలు మనదేశంలోని ప్రధాన భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో విడుదలవుతూ కలెక్షన్లని కొల్లగొట్టుకుపోతున్నాయి. తాజాగా మరో హాలీవుడ్‌ చిత్రం విడుదల కాబోతుంది. రేపు శుక్రవారం(ఫిబ్రవరి 18)ని `అన్‌ఛార్టెడ్‌`(Uncharted) అనే సినిమా విడుదల కాబోతుంది. `స్పైడర్‌ మ్యాన్‌` చిత్రాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న టామ్‌ హోలెండ్‌(Tom Holland) ఈ సినిమాలో హీరోగా నటించడం విశేషం. అయితే ఈ శుక్రవారం అన్ని భాషల్లోనూ పెద్ద సినిమాలు లేకపోవడంతో ఇది హాలీవుడ్‌ చిత్రానికి పెద్ద పండగే అని చెప్పొచ్చు. సినిమా బాగుంటే కాసుల వర్షం కురిపించుకుని పోతుందని అంటున్నారు క్రిటిక్స్. 

ఇక ఈ చిత్రం గురించి చూస్తే, `స్పైడ‌ర్ మ్యాన్`గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ హోలెండ్ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ `అన్ ఛార్టెడ్` సినిమాలో న‌టించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత `అన్ ఛార్టెడ్` అనే వీడియోగేమ్ ఆధారంగా ఈ సినిమా అదే టైటిల్ తో రూపొందించారు. ఇది ఫిబ్ర‌వ‌రి 18న థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది. ట్రెజర్ హంట్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు.

`స్పైడ‌ర్ మ్యాన్` ఫ్యాన్స్ తోపాటు ఒళ్లు గగ్గురుప‌రిచే యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇష్ట‌ప‌డే సినీ అభిమానుల్ని` అన్ ఛార్టెడ్` అల‌రించ‌నుందని చిత్ర బృందం చెబుతుంది. ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, మ‌ళ‌యాలీ భాష‌ల్లో విడుద‌ల అవ్వ‌నుంది. సినిమాలో దాదాపు మెజార్టీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కోసం హీరో టామ్ హోలెండ్ వంద‌ల అడుగుల ఎత్తులో ఎలాంటి డూప్‌ లేకుండా న‌టించారు. అంతేకాదు ప‌దిహేడు సార్లు కారుతో గుద్దించుకొని మ‌రీ టేక్ ఒకే చేయించుకుని సంచలనం సృష్టించారు.