నాన్న ఏదో ఒకరోజు రిటైర్మెంట్‌ తీసుకుని ఆయన బాధ్యతలు తనకు అప్పగిస్తారని అనుకున్నానని, కానీ ఈ రూపంలో ఆ బాధ్యతలు నెరవేరాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేద`ని లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీచరణ్‌ అన్నారు. 

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత నెల 25న కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. యావత్‌ ఇండియన్‌ సినీ లోకాన్నీ, సంగీత ప్రపంచాన్ని దుఖసాగరంలోకి నెట్టి ఆయన కరోనాతో పోరులో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ చెన్నైలోని సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలు తనయుడు చరణ్‌ పాల్గొని కన్నీటిపర్యంతమయ్యారు. 

బాలు జ్ఞాపకాలు, ఆయనతో అనుబంధం తదితర విషయాలపై స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. నాన్నకి ఇలాంటి కార్యక్రమాన్నినిర్వహిస్తామనిగానీ, ఇలాంటి సభలో మాట్లాడాల్సి వస్తుందని గానీ ఊహించలేదని, ఇది చాలా దురదృష్టకరమని ఎమోషనల్‌ అయ్యారు. తన జీవితంలో జరగాల్సింది జరిగిపోయిందని, నాన్నగారు తనపై ఇంతటి బాధత్యలు పెట్టి వెళ్ళిపోతారని ఊహించలేదని చరణ్‌ చెప్పారు. 

అయితే నాన్నగారు ఏదో ఒక రోజు నన్ను అన్నీచూసుకోమని చెబుతారేమో అనుకున్నా.కానీ ఆ రోజు ఈ రూపంలో వస్తుందనుకోలేదు. మాకు తీరని బాధని మిగిల్చారు. ఇలాంటి సందర్భంలో బాగా ఏడిస్తే మనసు బలంగా మారుతుందని అనుకుంటున్నా. ఈ బాధ నుంచి త్వరగా బయటపడి నాన్న నాపై పెట్టిన బాధ్యతలను నెరవేర్చాలనుకొంటున్నా` అని కన్నీటి పర్యంతమయ్యారు చరణ్‌.