లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత మూడు వారాలుగా కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిపిందే. కొద్ది పాటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీ పరిస్థితి తరువాత విషమించింది. ఆయన  శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవ్వటంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వార్తలు రావటంతో అభిమానులతో పాాటు సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

దాదాపు వారం రోజుల పాటు విషమ పరిస్థితిల్లోనే ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. గత మూడు రోజులుగా ఆయన కోలుకుంటున్నట్టుగా హెల్త్‌ బులిటెన్‌ ద్వారా తెలుస్తోంది. తాజాగా ఈ రోజు రిలీజ్ చేసిన వీడియోలో చరణ్‌, ఎస్పీబీ పరిస్థితిని వివరించారు. బాలసుబ్రహ్మణ్యంను ట్రీట్ చేస్తున్న డాక్టర్లను ఈ రోజు కలిసి మాట్లాడినట్టుగా తెలిపారు.

బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు పూర్తి స్పృహలో ఉన్నారన్న చరణ్, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ఆయనకు ప్రతీ రోజు పేపర్‌ చదివి వినిపించాల్సిందిగా డాక్టర్లను కోరినట్టుగా తెలిపారు. బాలు సంగీతం వింటున్నారనీ, ఆ పాటకు తాళం వేసేందుకు, పాడేందుకు ప్రయత్నిస్తున్నారని చరణ్ తెలిపారు. అంతేకాదు ఏదో రాసి చూపించేందుకు ప్రయత్నించారని, కానీ రాయలేకపోయారని చరణ్‌ వివరించాడు.

అయితే మరో వారంలో ఆయన చాలా వరకు కోలుకుంటారని చరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్జీఎం ఆసుపత్రి వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ ఆరోగ్య కుదుట పడాలని ప్రార్థనలు చేసిన వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

"