కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో దేశ వ్యాప్తంగా మారు మోగిన పేరు సోనూ సూద్‌. సినిమాల్లో విలన్‌ రోల్స్‌ చేసే సోనూ, రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. వేల మంది వలస కూలీలను సొంత గ్రామాలకు చేర్చటంలో సోనూ చేసిన కృషికి ప్రతీ ఒక్కరూ ఆయన ఫ్యాన్స్ గా మారిపోయారు. ఆ తరువాత కూడా తన సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు సోనూ. సోషల్‌ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తూ తన వంతు సాయం చేస్తున్నాడు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇవ్వటం మరోసారి సంచనలంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ శనివారం ప్రసారం కానున్న ది కపిల్‌ శర్మ షోలో సోనూ కనిపించనున్నాడు. తాజాగా ఆ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్‌ అయ్యింది. షోలో భాగంగా సోనూ సాయం పొందిన వ్యక్తుల రెస్పాన్స్‌ను వీడియో రూపంలో చూపించారు నిర్వాహకులు. అయితే ఆ  వీడియో చూసిన సోనూ సూద్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఈ ప్రోమో సోనీ టీవీ తన అఫీషియల్ ట్విటర్‌లో షేర్ చేయటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. సోనూ ఎమోషనల్‌ కావటంతో పాటు కపిల్ మార్క్‌ కామెడీ ఎంటర్‌టైన్మెంట్‌ కూడా షోలు ఉండనుంది. లాక్‌ డౌన్‌ సమయంలో వలస కూలీల కష్టాలను చూసి చెలించి పోయిన సోనూ సూద్‌ వారి కోసం కోట్లు ఖర్చు చేశాడు. లక్షల మంది ఆకలి తీర్చటంతో పాటు వేల మందిని సొంత ఇళ్లకు చేర్చాడు. గ్రామ మధ్యంలో చనిపోయిన 400 మంది వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాడు.