రియల్‌ హీరో సోనూ సూద్‌.. తాను రియల్‌ హీరో అని, గొప్ప మనసున్న వ్యక్తి అని నిరూపించుకున్న సందర్భాలు కోకోల్లలు. సినిమాల కంటే ఇప్పుడు ఆయన కరోనాతో పోరాడుతున్న పేషెంట్లని ఆదుకుని,  వారికి సహాయం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. బెడ్స్ కావాల్సిన వారికి బెడ్స్, ఆక్సిజన్‌ కావాల్సిన వారికి ఆక్సిజన్‌ ఏర్పాటు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం ఆయన ఆ విషయాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తనకు సాధ్యమైనంత వరకు ఆయన హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈక్రమంలో సోనూ సూద్‌ ఆపదలో ఉన్నవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటంలోనే తాను సంతృప్తిని పొందుతానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. `అర్థరాత్రి వచ్చిన ఫోన్‌ కాల్స్ తో అవసరమైన వారికి పడకలు, కొంత మందికి ప్రాణవాయువు, మరికొంత మంది ప్రాణాలను కాపాడగలగడంలో ఎంతో సంతృప్తి ఉంది. ఇది నాకు వంద కోట్ల సినిమాలో భాగం కావడం కంటే మిలియన్‌ రెట్లు సంతృప్తినిస్తుంది. ప్రజలు ఆసుపత్రి ముందు బెడ్స్ కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో నేను ప్రశాంతంగా నిద్ర పోలేను` అని పేర్కొన్నారు సోనూ సూద్‌. 

దీంతో ఆయనకు అనేక మంది నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. మీరే అసలైన హీరో అని కామెంట్ చేస్తూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు నిత్యం సహాయం చేయడంలో మునిగి తేలుతున్నారు సోనూసూద్‌. కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు కొన్ని రోజులు ఫుడ్‌ ఏర్పాటు చేసి వారిని చూసుకున్నారు. ఆ తర్వాత వారిని సురక్షితంగా సొంత ఊర్లకి చేర్చిన విషయం తెలిసిందే. ఇటీవల సోనూ సూద్‌ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.