ఇప్పటికే యావత్‌ దేశం ప్రజానికంతో రియల్‌ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్‌ తన దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. సేవ చేసేందుకు ఏమాత్రం అవకాశం దొరికినా వదలకుండా అపన్నహస్తం అందిస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల ఏపీ రాష్ట్రంలోని రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ అందించి షాక్‌ ఇచ్చారు. తాజాగా ఓ పేద మహిళకు రాఖీ బహుమానం ఇచ్చారు. ఆమెకి కొత్త ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. 

ఆ విశేషాలంటే చూస్తే, అస్సాంలోని జల్ పైగురిలో వరదల కారణంగా సోనాల్ సింఘ్ అనే మహిళ పూరి గుడిసె బాగా దెబ్బతిన్నది. ఉండేందుకు వీలు లేకుండా పాడైపోయింది. దాన్ని నిర్మించుకోవడానికి ఆమె వద్ద డబ్బు లేదు. పైగా అండగా ఉండేందుకు భర్త కూడా లేదు. పిల్లలు తినడానికి తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆమెకి ఓ మంచి ఐడియా వచ్చింది. తన పాడైన తన ఇంటిని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల సోనూ సూద్‌ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని సోనూసూద్ కి ట్యాగ్ చేసింది. అది చూసి చలించిపోయిన సోనూసూద్ .. ఆమెకు రాఖీ పండుగరోజును ఆ చెల్లెమ్మకి ఓ కొత్త ఇంటిని కానుకగా ఇస్తానని హామీ ఇచ్చాడు.

`రక్షా బంధన్ సందర్భంగా మా సోదరికి సహాయం చేద్దాం. ఆమె కోసం కొత్త ఇల్లు కట్టిద్దాం` అని సోను సూద్ ట్వీట్ చేశారు. దీంతో ఆ మహిళకి మైండ్‌ బ్లో అయ్యింది. దీనితో సోనూసూద్ పై మరోసారి సోషల్ మీడియా లో ప్రశంశల వర్షం కురుస్తుంది. ఓ అన్న తన సోదరికి రాఖీ రోజు ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వలేడు అని కామెంట్స్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్‌ టూ సోనూ భాయ్‌ అంటూ ప్రశంసిస్తున్నారు.