మరో గొప్ప పనితో వార్తలలో నిలిచారు సోనూ సూద్. ఆయన నిరుద్యోగులు మరియు పేదవారికి ఈ-రిక్షాలు పంపిణీ చేశారు. సోనూ సూద్ తన సొంత రాష్ట్రం పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఈ-రిక్షాలు అందించారు. ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న కొందరు పేదవారిని గుర్తించి సోనూ సూద్       ఈ-రిక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్‌ సచార్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, ఫలితంగా కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్న పేదవారికి సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు.

ఇతరులకు సేవ చేయాలన్న గుణాన్ని తాను పేరెంట్స్ నుండి పొందినట్లు సోనూ సూద్ తెలియజేయడం విశేషం. కొన్ని నెలలుగా సోనూ సూద్ కోట్ల రూపాయలు దానాధర్మాలకు ఖర్చు చేశారు. లాక్ డౌన్ సమయంలో వందల మంది పేద కార్మికులు తమ  గ్రామాలకు చేరడానికి అవసరమైన వాహనాలు సోనూ సూద్ సమకూర్చారు. బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి వాళ్ళు పాలిట దేవుడయ్యాడు.

దేశంలో ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా, అడిగిందే తడవుగా వాళ్ళ సమస్యను తీర్చాడు సోనూ సూద్. ఆ విధంగా సేవా గుణంలో అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు. దేశం మొత్తం సోనూ సూద్ ని రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. ఇక సోనూ సూద్ ఆచార్య మూవీలో కీలక రోల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.