పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ మరణించాడు. అతడి మృతదేహం ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు సోనూ సూద్ సహాయం కోరారు.  

అడిగిందే తడవుగా సహాయం చేస్తారు సోనూ సూద్. సోషల్ మీడియా వేదికగా ఆయనకు అనేక విజ్ఞప్తులు అందుతాయి. కోరికలో న్యాయం ఉంటే సోనూ సూద్ స్పందిస్తారు. సహాయం చేస్తారు. కాగా సౌదీ అరేబియాలో మరణించిన ఓ వలస కార్మికుడి మృతదేహం ఇండియాలోని కుటుంబ సభ్యులకు అప్పగించేలా చేశాడు. ఓ యువకుడు ట్విట్టర్ ఎక్స్ వేదికగా సోనూ సూద్ ని రిక్వెస్ట్ చేశాడు. అతని సందేశానికి సోనూ సూద్ వెంటనే స్పందించాడు.

ప్రియమైన సోనూ సూద్. సౌదీ సిమెంట్ హోఫఫ్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్న మా అంకుల్ గుండెపోటుతో మరణించాడు. ప్రస్తుతం ఆయన మృతదేహం సౌదీ అరేబియాలోని కింగ్ ఫైజల్ జనరల్ హాస్పిటల్ లో ఉంది. దయచేసి ఆయన మృతదేహాన్ని ఇండియాకు తెప్పించగలరు... అని రిక్వెస్ట్ చేశాడు. దీనికి సమాధానంగా సోనూ సూద్... మీ అంకుల్ మృతదేహం ఇండియాకు తెప్పించేందుకు నేను నా ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడాను.. అని రాసుకొచ్చాడు. 

చెప్పిన విధంగా సదరు వలస కార్మికుడి మృతదేహాన్ని సోనూ సూద్ ఇండియాకు తెప్పించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అందుకు సహకరించిన గిరీష్ పంత్ కి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మరణించిన కార్మికుడు హైదరాబాద్ కి చెందిన వ్యక్తి అని సమాచారం. 

కోవిడ్ సమయంలో సోనూ సూద్ పేదవారికి, వలస కార్మికులకు చేసిన మేలు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. లాక్ డౌన్ కారణంగా అనేక నగరాల్లో ఇరుక్కుపోయిన కార్మికులు తమ ఊళ్లకు చేరేందుకు సొంత డబ్బులతో వాహనాలు ఏర్పాటు చేశారు. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో కార్మికులు వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్లే ప్రయత్నంలో మరణించారు. 2020 నుండి సోనూ సూద్ వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేశారు.... 

Scroll to load tweet…