క్రేజీ హీరో వివేక్ ఒబెరాయ్ భారత చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వివేక్ ఒబెరాయ్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. కానీ తాజాగా వివేక్ చేసిన ఓ ట్వీట్ అతడికి చిక్కులు తెచ్చిపెడుతోంది. పలువురు మహిళా సెలెబ్రిటీలు, నెటిజన్లు వివేక్ ఒబెరాయ్ పై మండిపడుతున్నారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పై కొందరు నెటిజన్లు అసభ్యంగా చిత్రీకరించిన మీమ్ ని వివేక్ ఒబెరాయ్ సమర్ధిస్తూ కామెంట్ చేయడం ఈ వివాదానికి దారితీసింది. 

ఐశ్వర్యరాయ్ గతంలో కొందరు బాలీవుడ్ హీరోలతో ప్రేమ వ్యవహారాలు సాగించిందనే రూమర్లు ఉన్నాయి. ఆదివారం రోజు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా కొందరు ఆకతాయిలు ఐశ్వర్యారాయ్ పై ఓ మీమ్ ని తయారు చేశారు. అందులో ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ తో ఉన్న ఫోటోపై ఒపీనియన్ పోల్ అని, వివేక్ ఒబెరాయ్ తో ఉన్న ఫోటోపై ఎగ్జిట్ పోల్ అని.. తన భర్త అభిషేక్, కుమార్తె ఆరాధ్యతో ఉన్న ఫోటోని ఫైనల్ రిజల్ట్స్ గా పేర్కొన్నారు. 

దీనిపై వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. 'హహహ.. క్రియేటివ్.. ఇక్కడ రాజకీయాలు లేవు.. జీవితాలు మాత్రమే' అంటూ ఐశ్వర్యరాయ్ పై పరోక్షంగా కామెంట్స్ చేశాడు. దీనితో వివేక్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ బయోపిక్ లో నటించినంత మాత్రాన నీవేమైనా ప్రధాని అనుకుంటున్నావా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

వివేక్ ట్వీట్ పై క్రేజీ హీరోయిన్ సోనమ్ కపూర్ స్పందించింది. అసభ్యంగా ఉంది.. గౌరవాన్ని తగ్గించుకునే చర్య అని అర్థం వచ్చేలా సోనమ్ ట్వీట్ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీకు తగదు అంటూ ఓ మహిళా జర్నలిస్ట్ కూడా వివేక్ కు చురకలు అంటించింది. ఐశ్వర్యరాయ్ కి గతంలో ప్రేమ వ్యవహారాలు ఉండొచ్చు.. కానీ ప్రస్తుతం ఆమె మరొకరికి భార్య. ఇలాంటి వ్యాఖ్యల వలన ఆమె కుటుంబ సభ్యులు బాధపడతారు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.