Sobhan Babu wife death: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. అలనాటి అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూశారు. ఈ వార్త తెలిసి ఇండస్ట్రీలోని ప్రముఖులు శోభన్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
శోభన్ బాబు సతీమణి కన్నుమూత..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందగా, సోగ్గాడు గా చెరగని ముద్ర వేసిన దివంగత అగ్ర నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (96) తుదిశ్వాస విడిచారు. వయోభారం, గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగా గురువారం నాడు చెన్నైలో ఆమె కన్నుమూశారు.ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న శాంతకుమారిని గురువారం పరామర్శించడానికి ఒక ఆప్తమిత్రురాలు వచ్చారు. ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుండగానే శాంతకుమారికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) వచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
ప్రచారాలకు దూరంగా శాంతకుమారి..
శోభన్ బాబు, శాంతకుమారిల వివాహం 1958 మే 15న జరిగింది. దశాబ్దాల పాటు అత్యంత ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని గడిపిన ఈ దంపతులకు నలుగురు సంతానం కలిగారు. వారిలో కుమారుడు కరుణ శేషు కాగా, ముగ్గురు కుమార్తెలు మృదుల, ప్రశాంతి, నివేదిత ఉన్నారు. శోభన్ బాబు సినీ రంగంలో స్టార్ హీరోగా ఎదిగి, అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ, శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానికి, ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ భర్త విజయాల్లో ఆమె కొండంత అండగా నిలిచారని సన్నిహితులు గుర్తు చేసుకుంటారు.
చెన్నైలో అంత్యక్రియలు...
2008 సంవత్సరంలో శోభన్ బాబు గుండెపోటుతోనే ఆకస్మికంగా మరణించారు. భర్త మరణం తర్వాత శాంతకుమారి పూర్తిగా ప్రజా జీవితానికి దూరమయ్యారు. చెన్నైలోనే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా శేషజీవితాన్ని గడిపారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహాన్ని చెన్నైలోని వారి నివాసానికి తరలించారు. నేడు (శుక్రవారం) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. శాంతకుమారి మృతి పట్ల సినీ ప్రముఖులు, శోభన్ బాబు అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
