సారాంశం

బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు హీరోగా నటించిన `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ  పవన్ కళ్యాణ్‌ `బ్రో` సినిమాతో పోటీగా నెక్ట్స్ డేనే విడుదల కాబోతుంది.  అయితే దీని వెనకాల పెద్ద ప్లానే ఉందట. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, తన మేనల్లుడు సాయితేజ్‌ కలిసి నటించిన `బ్రో` చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. అయితే పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఉందంటే మిగిలిన అన్నీ సినిమాలు పక్కకెళ్లిపోవాల్సిందే. ఆయనకు పోటీగా రిలీజ్‌ చేసేందుకు ఎవరూ సాహసం చేయరు. ఆ పోటీకి దూరంగా ఉంటారు. కానీ ఓ చిన్న సినిమా `స్లమ్‌ డాగ్ హజ్బెండ్‌` మాత్రం పోటీకి దిగింది. ఒక్క రోజు గ్యాప్‌తో జులై 29న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. దీంతో ఏంటీ ధైర్యం అని అంతా అనుకుంటున్నారు. కానీ టీమ్‌ మాత్రం మంచి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. పెద్ద రీజన్‌తోనే రంగంలోకి దిగింది. 

తాజాగా ఆ విషయాన్ని నిర్మాత అప్పిరెడ్డి తెలిపారు. తాను పవన్ కళ్యాణ్‌కి అభిమానినే అని, ఆయన సినిమా కోసం తాము వెయిట్‌ చేస్తున్నామని తెలిపారు. అయితే పోటీగా రిలీజ్‌ చేయడంపై స్పందిస్తూ, పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ భారీస్థాయిలో ఉంటారు. మొదటి రెండు మూడు రోజులు ఫ్యాన్స్ కి టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఓవర్‌ ఫ్లో తమకు కలిసొస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. టికెట్‌ దొరకని ఆడియెన్స్ తమ సినిమాని చూసినా చాలు అనే ఆలోచనలో ఉన్నారు నిర్మాత. తాజాగా ఆ విషయాన్ని వెల్లడించారు. దీంతోపాటు `బ్రో` జోనర్‌ వేరు, `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` జోనర్‌ వేరు. కాబట్టి `బ్రో` చూసిన వాళ్లు కూడా సరదాగా నవ్వుకునేందుకు తమ సినిమాకి వస్తారని చెబుతున్నారు. 

`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమని, అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన కుర్రాడు కుక్కని పెళ్లి చేసుకుంటాడు. జ్యోతిష్యం ప్రభావంతో తమలో ఉన్న దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆ పని చేస్తారని, మరి దీని కారణంగా ఏం జరిగింది, దోషంలో నిజమెంతా? కుక్కతోపెట్టి, ఆ తర్వాత విడాకుల అంశాలు ఎలాంటి ఫన్నీ సంఘటనలకు దారితీశాయనేది ఆద్యంతం సరదాగా ఉంటాయని, సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. కుక్కని పెళ్లి చేసుకోవడమనే కాన్సెప్టే కొత్తగా ఉందని, దాన్నుంచి పుట్టే ఫన్‌ మరింతగా నవ్వులు పూయిస్తుందన్నారు. అయితే సినిమా కేవలం ఆ డాగ్‌ ఫన్ మాత్రమే కాదు, అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. ఆలోచింప చేసేలా కూడా ఉంటుందన్నారు. 

సింపుల్‌ కాన్సెప్ట్ చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అలానే `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` కూడా నిలుస్తుందని తెలిపారు. థియేటర్‌కి వచ్చిన ఆడియెన్స్ ని ఏమాత్రం డిజప్పాయింట్‌ చేయదని, కాలర్‌ ఎగరేసి మరీ చెబుతున్నానని తెలిపారు. నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణవి మానుకొండ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహించారు. మైక్‌ మూవీస్‌ పతాకంపై అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. జులై 29న ఈ చిత్రం విడుదల కానుంది.