Asianet News TeluguAsianet News Telugu

Skanda Trailer 2: పొలిటికల్‌గా కాకరేపే డైలాగులతో `స్కంద` ట్రైలర్.. టార్గెట్‌ జగనా?

 `కల్ట్ జాతర` పేరుతో ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో `స్కంద` రిలీజ్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో మాస్‌ డైలాగులు, మాస్‌ ఎలిమెంట్లతోపాటు పొలిటికల్‌ డైలాగులు కూడా ఉండటం విశేషం. 

skanda release trailer out with powerful political dailogues target cm jagan ? arj
Author
First Published Sep 25, 2023, 9:03 PM IST

రామ్‌ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను `స్కంద` సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. అది ఆద్యంతం ఆకట్టుకుంది. బోయపాటి మార్క్ యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్లతో సాగింది. కొన్ని డైలాగులు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. సెటైరికల్‌గానూ అనిపించాయి. అయితే అది విడుదలై చాలా రోజులవుతుంది. సినిమాపై బజ్‌ తగ్గిపోయింది. 

దీంతో ఇప్పుడు రెండో ట్రైలర్‌ని విడుదల చేశారు. కరీంనగర్‌లో `కల్ట్ జాతర` పేరుతో ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో `స్కంద` రిలీజ్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో మాస్‌ డైలాగులు, మాస్‌ ఎలిమెంట్లతోపాటు పొలిటికల్‌ డైలాగులు కూడా ఉండటం విశేషం. అయితే ప్రధానంగా ఓ డైలాగ్‌ మాత్రం ఇప్పుడు దుమారం రేపుతుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇందులో పొలిటికల్‌ లీడర్లని ఉద్దేశించిన రామ్‌ వార్నింగ్‌ ఇచ్చే డైలాగు ఆకట్టుకుంటుంది. `మనిషికో పేరు, ఊరికో గౌరవం, ప్రతి పదవికీ ఓ బాధ్యత ఉంటుంది. అది మరిచిపోయి మీరు ఇద్దరూ తీసిన పరువు, కూల్చేసిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి` అని రామ్‌ వార్నింగ్‌ ఇవ్వడం విశేషం. 

శ్రీలీలని పట్టుకుని ఆయన ప్రత్యర్థులైన పొలిటికల్‌ లీడర్లని హెచ్చరించారు. దీంతో ఇది ఏపీ రాజకీయాలకు వర్తించేలా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో ఏపీ సీఎం జగన్‌ వ్యవహారం, ఆయన్ని జైల్లో పెట్టడం వంటి పరిణామాలను ఉద్దేశించి బోయపాటి ఈ డైలాగ్‌ పెట్టి ఉంటాడని అంటున్నారు. కానీ డైలాగ్‌ మాత్రం అదిరిపోయేలా ఉంది. దీంతోపాటు ప్రారంభంలోనే జైల్‌ సీన్‌ చూపించారు. పరిస్థితులకు తలవంచి తప్పుచేశానని మీరు ఒప్పుకోవచ్చు, ఆ చట్టం ఒప్పుకోవచ్చు, ఆ ధర్మం ఒప్పుకోవచ్చు, కానీ ఆ దైవం ఒప్పుకోదు సర్‌` అనే డైలాగ్‌ కూడా చంద్రబాబుకి రిలేటెడ్‌గా అనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ఇక రామ్‌.. `రింగ్‌లోకి దిగితే రీ సౌండ్‌ రావాలే, చూసుకుందాం, బరాబర్‌ చూసుకుందాం` అని చెప్పడం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. దీంతోపాటు `మేం కోడిని, పొటేలునే కాదు, మాకు ఎదురొస్తే దేన్నైనా పచ్చడి పెడితాం, జాడీ ఎక్కిస్తాం` అని పొలిటికల్‌ లీడర్‌ పాత్ర చెప్పే డైలాగ్‌ సైతం ఆకట్టుకుంటుంది. చివర్లో `నేను చంపేటప్పుడు వాడి తలకాయ ఏడుందో చూస్తా, వాడి వెనకాలు ఎవడున్నడో సూడను` అంటూ మాస్‌ లుక్‌లో రామ్‌ చెప్పే డైలాగ్‌ హైప్‌ తెప్పిస్తుంది. ఈ ట్రైలర్‌ పూర్తిగా యాక్షన్‌ ప్రధానంగా సాగింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios