తమిళ స్టార్ హీరోకి శివ కార్తికేయన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. శివ కార్తికేయన్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. అజిత్, విజయ్ తరహాలో ఏడాదికి ఒక సినిమా కాకుండా ఈ హీరో రెండు మూడు చిత్రాలని రిలీజ్ చేస్తుంటాడు. సంపాదన కూడా బాగానే ఉంది. ఇటీవల హీరోలు కూడా నిర్మాణ రంగంపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. 

శివ కార్తికేయన్ నిర్మాతగా ''నెంజంయుండు నేరమైయుండు ఓడు రాజా' చిత్రాన్ని రూపొందించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. సొంతంగా ఎస్ కె ప్రొడక్షన్స్ ని స్థాపించి శివకార్తికేయన్ నిర్మించిన చిత్రం ఇది. తాను నిర్మించిన చిత్రం సక్సెస్ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

ఇటీవల ఈ చిత్ర సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో శివకార్తికేయన్ మాట్లాడుతూ..  స్నేహితులకు చేయూత అందించేందుకే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు శివకార్తికేయన్ తెలిపాడు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు కార్తీక్ వేణుగోపాల్ ఈ హీరోకి మంచి స్నేహితులు. 

బుల్లి తెరపై, యూట్యూబ్ లో తమ ప్రతిభ చాటుకునేందుకు కష్టపడుతున్న వీరందరిని ఒకదగ్గరకు చేర్చి శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా శివకార్తికేయన్ స్నేహితులకు మంచి గుర్తింపు రాగా, కమర్షియల్ గా కూడా లాభాలని తెచ్చిపెడుతోంది.