ప్రముఖ హాస్యనటుడు వివేక్ పై శివాజీ గణేషన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'బిగిల్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే నాయకులు ఖండించడంతో పాటు, నటుడు విజయ్ పై ఎదురు దాడి చేస్తున్నారు. అదే స్టేజ్ పై
నటుడు వివేక్ చేసి వ్యాఖ్యలు ఆయన్ని ఇబ్బందుల్లో పడేసింది.

1980లో శివాజీ గణేషన్, వైజయంతిమాల జంటగా నటించిన 'ఇరుంబుతిరై' సినిమాలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటను అవమానించే విధంగా వివేక్ చేసిన కామెంట్స్ కు శివాజీ గణేషన్ సమూగ నల పేర్వై సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై ఆ సమాఖ్య అధ్యక్షుడు చంద్రశేఖరన్ బుధవారం ఒక ప్రకరణ విడుదల చేశారు.

కొందరు స్టేజ్ ఎక్కగానే.. జనాలను చూసి ఏదేదో మాట్లాడుతుంటారని.. నటుడు వివేక్ కూడా అంతే అని.. ఆయన 'బిగిల్' సినిమా ఆడియో ఈవెంట్ లో శివాజీ గణేషన్ పాటను అపహాస్యం చేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నటుడు వివేక్ గతంలో కూడా పరాశక్తి చిత్రంలో శివాజీగణేశన్‌ న్యాయస్థానంలో చెప్పే సంభాషణలను ఎగతాళి చేసే విధంగా మాట్లాడారని అన్నారు.

ఇక ముందు ఆయన ఇలానే ప్రవర్తిస్తే ఆయనకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై స్పందించిన వివేక్.. 1980లో శివాజీగణేశన్‌ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్‌ కుడియిరుక్కుం అనే పాటలోప్రేమ భావం కలుగుతుందని.. విజయ్ చెప్పిన దానిలో మంత్రశక్తిలా అనిపిస్తోందని తాను చెప్పానని.. అభిమానులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.