సార్ మూవీ  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. తొలి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.. తొలి రోజే రికార్డు ఓపెనింగ్ అందుకున్న ధనుష్.. మూడు రోజులూ అదే కొనసాగించాడు. 


తమిళ హీరో ధనుష్ హీరోగా తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం సార్. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో మొన్న శుక్రవారం విడుదల అయింది. తమిళంలోనూ వాతి పేరుతో రిలీజైంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే సాధిస్తోంది. మంచి సందేశాత్మక కథతోపాటు ధనుష్ తనదైన స్టైల్లో నటించడం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే మంచి వసూళ్లు రాబట్టింది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.16.54 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వీకెండ్‌లో ఇది రూ.51కోట్ల గ్రాస్‌ వసూలుచేయడం మరో విశేషం. తెలుగులో ఇప్పటి వరకూ రిలీజైన ధనుష్ మూవీస్ అన్నింటిలోకీ ఈ సార్ మూవీ కలెక్షన్లే అత్యధికం. తొలి రోజే రికార్డు ఓపెనింగ్ అందుకున్న ధనుష్.. మూడు రోజులూ అదే కొనసాగించాడు. ట్రేడ్ వర్గాల్లో చెప్పుకునే దాని ప్రకారం సార్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వెళ్లింది. సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆదిలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రల్లో కనిపించటం కూడా కలిసొచ్చింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. ఇక ఈ చిత్రం ఓటిటి రైట్స్ మంచి రేటుకే వెళ్లాయని సమాచారం.

 ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. త‌మిళం, తెలుగు భాష‌ల్లో ధ‌నుష్ సినిమాల‌కు మంచి క్రేజ్, డిమాండ్ ఉండ‌టంతో భారీ మొత్తానికి ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. మార్చి నెలాఖ‌రున లేదా ఏప్రిల్ ప్ర‌థ‌మార్థంలో సార్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ ని పాపులర్ టెలివిజన్ ఛానెల్ జెమినీ టీవి వారు ఎక్వైర్ చేసినట్లు సమాచారం. 

విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోతుపాతుల‌ను ఆవిష్క‌రిస్తూ రూపొందిన సినిమా ఇది. అంద‌రికి అందుబాటులో ఉండాల్సిన విద్యా నేడు ఎలా వ్యాపారంగా మారిపోయింది? అధిక ఫీజుల కార‌ణంగా దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పిల్ల‌లు చ‌దువుకు ఏ విధంగా దూర‌మ‌వుతోన్నార‌నే పాయింట్‌తో సార్ సినిమాను తెర‌కెక్కించారు వెంకీ అట్లూరి. సింపుల్ క‌థ‌కు ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా సుగ‌ర్ కోటెడ్‌లా సోష‌ల్ మెసేజ్‌ను జోడించి ప్రేక్ష‌కుల్ని మెప్పించేప్ర‌య‌త్నం చేశారు.