సీనియర్ సింగర్ వాణీ జయరామ్ ని పద్మ భూషణ్ అవార్డు వరించింది. నేడు రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుని ప్రకటించింది. 

సీనియర్ సింగర్ వాణీ జయరామ్ ని పద్మ భూషణ్ అవార్డు వరించింది. నేడు రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుని ప్రకటించింది. ఈ జాబితాలో సంగీత దర్శకుడు కీరవాణి, నటి రవీనా టాండన్ పద్మ శ్రీకి ఎంపిక కాగా.. వాణీ జయరామ్ పద్మభూషణ్ కి ఎంపిక అయ్యారు. 

వాణీ జయరామ్ తెలుగు తమిళం, హిందీ ఇలా అన్ని ప్రధాన భాషల్లో ఎన్నో మధురమైన పాటలు పాడారు. తమిళనాడు వేలూరులో జన్మించిన వాణీ జయరామ్ దాదాపు 5 దశాబ్దాలు సంగీత ప్రియులని తన గాత్రంతో అలరించారు. చిన్నవయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతూ వాణీ జయరామ్ తన ప్రతిభ చాటుకున్నారు. 

వివాహం తర్వాత తన భర్త ప్రోత్సాహంతో గాయనిగా మరింత ఎదిగారు. 1975లో వాణీ జయరామ్ తొలిసారి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్ లో పాడిన పాటలకి గాను ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణం చిత్రంలో పలు పాటలు పాడి మరోసారి జాతీయ అవార్డు కైవసం చేసుకున్నారు. 1991లో స్వాతికిరణం చిత్రానికి మూడవసారి ఆమెకి నేషనల్ అవార్డు దక్కింది. 

తెలిమంచు కరిగింది.. ఎన్నెన్నో జన్మల బంధం.. ఒక బృందావనం లాంటి సూపర్ హిట్ సాంగ్ ఆమె గాత్రం నుంచి జాలువారినవే. అన్ని భాషల్లో కలిపి ఆమె 14 వేల పాటలు పాడారు. కెవి మహదేవన్, ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథ్ , చక్రవర్తి లాంటి ప్రముఖ సంగీత దర్శకులు వాణీ జయరామ్ తో పాటలు పాడించారు. 

ఈ మధుర గాయానికి పద్మభూషణ్ రావడంతో అభిమానులు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెని అభినందిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తాను గాయనిగా ఇంత కీర్తి సంపాదించడానికి కారణం తన భర్త జయరామ్ అని ఆమె చెబుతుంటారు. ఆయన 2018లో మరణించారు. 

Scroll to load tweet…