మనసుండాలె కానీ వయసుదేముంది... వేడుకలకు కొదవేముంది అన్నట్లు ఉంది సింగర్ సునీత వ్యవహారం. ఈ వయసులో రెండో పెళ్లి అంటే ఏమంటారో అని మొదట్లో సంశయించిన సునీత ఫ్యాన్స్ నుండి మద్దతు లభించాక అంతులేని ఆనందంతో తన పెళ్లిని జరుపుకుంటుంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ లగ్జరీ హోటల్ లో సన్నిహితులు అందరినీ పిలిచి పార్టీ ఇచ్చారు. సునీతతో పాటు కాబోయే భర్త రామ్ కేక్ కటింగ్ చేసి జరగబోయే పెళ్లిని సెలెబ్రేట్ చేసుకున్నారు. హీరో నితిన్ తో పాటు యాంకర్ సుమ, రేణూ దేశాయ్ ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. 

గత పార్టీ అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్న సింగర్ సునీత ఈ సారి భారీగా ప్రీ వెడ్డింగ్ వేడుక ఏర్పాటు చేశారు. దీనికోసం గ్రాండ్ గా ఆహ్వాన పత్రిక కూడా ప్రచురించారు. డిసెంబర్ 26న సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమయ్యే గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి అందరూ రావాలని ఆహ్వానించారు. చిత్ర పరిశ్రమ నుండి అనేకమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం. 

మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. మొదటి భర్త కిరణ్ కుమార్ గోపరాజుతో విడాకులు తీసుకొని విడిపోయిన సునీత రెండవ వివాహంగా రామ్ ని చేసుకుంటున్నారు. డిసెంబర్ 27న వీరిద్దరి వివాహం అంటూ వార్తలు వచ్చాయి. కారణం ఏదైనా వీరు వివాహాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. సునీతకు టీనేజ్ దాటిన ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.