కాదేది కవితకి అనర్హం అన్నట్టు.. కరోనాకి ఎవరూ అతీతులు కావడం లేదు. కేంద్ర హోంమంత్రి నుంచి గల్లీ కూలీ వాడి వరకు ఎవరైనా దాని బారిన పడుతున్నారు. అజాగ్రత్తగా ఉంటే అది కులమతాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కరోనా వెంటాడుతుంది. సెలబ్రిటీలను సైతం వెంటాడుతుంది. అమితాబ్‌ ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీలకు వైరస్‌ సోకింది. 

తాజాగా టాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ స్మితని వదలలేదు. ఆమెకి కూడా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా స్మిత ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. త్వరలోనే కరోనాని జయించి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ, నిన్న చాలా ఇబ్బందికరమైన రోజు. బాగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. హెవీ వర్కవుట్స్ వల్ల ఏమో అనుకున్నాను. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోగా, నాకూ.. అలాగే నా భర్త శశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. పెద్దగా లక్షణాలు అయితే కనిపించలేదు. మేము ఇంటివద్దే క్షేమంగా ఉన్నా కూడా మా ఇంటిలోకి కోవిడ్ వచ్చి చేరింది. త్వరగా కరోనాని జయించి, ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను` అని స్మిత వెల్లడించారు. వారు త్వరగా వైరస్‌ నుంచి ఆరోగ్యంగా బయటపడాలని పలువురు సెలబ్రిటీలు కోరుతూ ఆమెకి ధైర్యం చెబుతున్నారు. 

స్మిత ఇప్పుడు సింగర్‌గా బాగా పాపులర్‌ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె సోలో ఆల్బమ్స్ చేసి విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఆమె కీర్తనలు, డాన్స్లులు సైతం మెప్పిస్తున్నాయి.