ప్రముఖ గాయని  శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. పలు సంధర్భాల్లో సెలెబ్రిటీలు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వార్తలు వింటూనే ఉన్నాం. శిల్పా శెట్టి, షారుఖ్ ఇలా బడా స్టార్స్ విమానాశ్రయాల్లో సెక్యూరిటీ సిబ్బంది వల్ల సమస్యలు ఎదుర్కొన్న వారే. భాష ఏదైనా కానీ తన గాత్రంతో మంత్రముగ్దుల్ని చేసే శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. 

శ్రేయా ఘోషల్ బుధవారం రోజు తన సంగీత వస్తువులని తీసుకుని సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కేందుకు వెళ్లారు. కానీ సెక్యూరిటీ అధికారులు ఆమెని విమానం ఎక్కనివ్వలేదు. సంగీత వస్తువులని తీసుకువెళ్లకూడదని అడ్డుకున్నారట. దీనితో శ్రేయా ఘోషల్ కు నిరాశే ఎదురైంది. సింగపూర్ ఎయిర్ లైన్స్ నిర్వాకాన్ని శ్రేయా ఘోషల్ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. 

సంగీత విద్వాంసులు, గాయకులు సింగపూర్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించకూడదు అనుకుంటా. సంగీతానికి సంబంధించిన విలువైన వస్తువులు ఉంటే వెనక్కు పంపిస్తున్నారు. సింగపూర్ ఎయిర్ లైన్స్ వాళ్ళు మంచి గుణపాఠం నేర్పారు అంటూ శ్రేయా ఘోషాల్ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. శ్రేయా ట్వీట్ పై సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించింది. సారీ శ్రేయా ఘోషల్.. మీ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై విచారణ చేస్తున్నాం అని ట్వీట్ చేశారు.